Nimmala Ramanaidu: వారు తీవ్రవాదులతో సమానం
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:40 AM
అమరావతితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
దుష్ప్రచారం చేసేవారిపై నిమ్మల ఫైర్
అమరావతి/పాలకొల్లు అర్బన్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): అమరావతితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ముంపు ముప్పు లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. వరద వస్తోందంటూ దుష్ప్రచారం చేసేవారెవరైనా తీవ్రవాదులతో సమానమన్నారు. ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, ఆందోళనకు, భయభ్రాంతులకు గురి చేయడం క్షమించరాని నేరమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం పాలకొల్లులోనూ మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని నగర ప్రాంతంపై వైసీపీ వెనుకుండి వివిధ మాధ్యమాల ద్వారా విషప్రచారం చేయిస్తోందని విమర్శించారు. పోలవరం కాఫర్ డ్యామ్‌కు గండి పడిందని, బుడమేరు పొంగి ప్రవహిస్తోందని, విజయవాడకు మళ్లీ వరద ముప్పు ఉందని అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. పొన్నూరులో పొలాల మునకకు కారణం కొండవీటి వాగు మళ్లింపు కాదని, 24 గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్ల వర్షపాతంతో వర్షపునీరు పొంగి ప్రవహించిందని వెల్లడించారు. కొండవీటివాగు వరద నీటిని పంపింగ్ ద్వారా నదిలోకి మళ్లిస్తున్నామని వివరించారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ, గుంటూరు చానల్, అప్పాపురం చానల్‌ను వర్షాల కారణంగా మూసివేసినట్టు వివరించారు. గుంటూరు చానల్‌కు కూడా కొండవీటివాగు నుంచే నీరందుతోందని, జగన్ హయాంలో యాజమాన్య నిర్వహణ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయని, వాటిని కూడా సరిచేశామని తెలిపారు. రాజధాని ప్రాంతానికి ముంపు ముప్పులేదని ప్రజలు గ్రహించాలని కోరారు. భద్రతా చర్యల్లో భాగంగా 80 టీఎంసీలు మాత్రమే నిల్వచేయాలని తుంగ భద్ర బోర్డు నిర్ణయం తీసుకుందని నిమ్మల వివరించారు. తుంగభద్ర ప్రాజెక్టు ప్రమాదంలో ఉందనటం పూర్తి అవాస్తవమని రామానాయుడు స్పష్టం చేశారు.