Share News

Nara Bhuvaneshwari: నిమ్మకూరు ఓ తీపి జ్ఞాపకం

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:24 AM

పేదరికంలేని సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతూ నిరంతరం ప్రజల గురించి అలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు...

Nara Bhuvaneshwari: నిమ్మకూరు ఓ తీపి జ్ఞాపకం

  • గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం

  • పేదరికం లేని సమాజమే చంద్రబాబు ధ్యేయం

  • సీహెచ్‌సీ శంకుస్థాపన కార్యక్రమంలో భువనేశ్వరి

పామర్రు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పేదరికంలేని సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతూ నిరంతరం ప్రజల గురించి అలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజాతో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిమ్మకూరు ఓ తీపి జ్ఞాపకం: నారా భువనేశ్వరి

‘నిమ్మకూరు రావడం ఓ తీపి జ్ఞాపకం. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. బాల్యంలో పాఠశాల సెలవుల్లో అమ్మ బసవతారకమ్మ మమ్మల్ని నిమ్మకూరుకు పంపించేది. ఇక్కడ ఎక్కువగా నా సోదరి శారద ఉండేవారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో పామర్రుకు సినిమాలు చూసేందుకు వెళ్లేవాళ్లం. నేడు ఫోన్లు, కార్లు కావాలని అడుగుతున్నారు. అది అంతశ్రేయస్కరం కాదు. నా చిన్నతనంలో నాన్న ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడి గ్రామంలో ఇంటింటికి తిరిగి సైకిల్‌పై పాలు అమ్మి కుటుంబ సభ్యుల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన కారణజన్ములు. అన్ని రంగాల్లో మగవారికి దీటుగా రాణిస్తున్న మహిళలను ఆదర్శంగా బాలికలు తీసుకుని ముందుకు సాగాలి. ఐటీ రంగంలో అద్భుతమైన ప్రతిభను మహిళలే కనబరుస్తున్నారు. నిమ్మకూరు గ్రామాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్న సీఎం ఆలోచనకు సంపన్నులు ముందుకు రావడం సంతోషకరం’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. తొలుత గ్రామంలోని ఏపీఆర్జేసీ పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. గ్రామంలోని ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 04:25 AM