Share News

Nilayapalem Vijayakumar: రాష్ట్ర ఆర్థికస్థితిపై జగన్‌వన్నీ వక్రీకరణలే

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:06 AM

అసత్యాలు, వక్రీకరణలతో జగన్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nilayapalem Vijayakumar: రాష్ట్ర ఆర్థికస్థితిపై జగన్‌వన్నీ వక్రీకరణలే

  • చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం గాడినపడుతోంది

  • గత ఏడాది కన్నా జీఎస్టీ ఆదాయంలో 14శాతం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 46శాతం వృద్ధి: నీలాయపాలెం

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): అసత్యాలు, వక్రీకరణలతో జగన్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జూన్‌ నెలకు సంబంధించి కాగ్‌ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని జగన్‌ చేసిన ఆరోపణలు సత్యదూరం. ఎస్‌జీఎస్ టీ, ఐజీఎస్‌టీలను విడదీసి చూపుతూ ప్రజల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోంది. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలోకి వస్తోంది. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన జీఎస్టీ గణాంకాలే. ఆగస్టు 1న కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ గణాంకాల ప్రకారం 2025 జూలైలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,803 కోట్లుకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 14శాతం అధికం. ఈ ఏడాది జూలైతో పోలిస్తే 6శాతం అధికం. ఈ పెరుగుదల వెనుక ప్రజల విశ్వాసం, ప్రభుత్వ విధానాల ప్రభావం దాగి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మరో కీలక సూచికగా నిలిచే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ ఆదాయాల్లో 2024 తొలి త్రైమాసికంలో రూ.1,819 కోట్లు ఉండగా, 2025లో అదే మూడు నెలల్లో రూ.2,661 కోట్లకు పెరిగింది. ఇది ఏకంగా 46శాతం వృద్ధి. తాజా గణాంకాల ప్రకారం 2025 ఏప్రిల్‌-జూలైలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.42,693 కోట్లు మాత్రమే. అదే కాలంలో 2024లో వైసీపీ ప్రభుత్వం రూ.43,052 కోట్లు అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన రూ.25 వేల కోట్ల బకాయిలను సర్దుబాటు చేస్తూ... అభివృద్ధి, సంక్షేమాలను అమలు చేస్తూనే అప్పుల భారాన్ని తగ్గించుకుంటూ వస్తోంది’ అని విజయకుమార్‌ వివరించారు.

Updated Date - Aug 03 , 2025 | 05:08 AM