Vijayawada Police: నోరు విప్పని కి లేడీ
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:38 AM
నెల్లూరుకు చెందిన కి‘లేడీ’ డాన్ నిడగుంటి అరుణ పోలీసు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఎన్ని ప్రశ్నలువేసినా ‘తెలియదు’ అని సమాధానం మాత్రమే వచ్చింది.
అరుణను 50 ప్రశ్నలు అడిగిన పోలీసులు
ఒక్కరోజే సాగిన విచారణ.. ముగిసిన కస్టడీ
విజయవాడ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): నెల్లూరుకు చెందిన కి‘లేడీ’ డాన్ నిడగుంటి అరుణ పోలీసు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఎన్ని ప్రశ్నలువేసినా ‘తెలియదు’ అని సమాధానం మాత్రమే వచ్చింది. పోలీసుశాఖలో ఎస్‌ఐ, మహిళా శిశు సంక్షేమశాఖలో అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇప్పిస్తానని విజయవాడకు చెందిన వృద్ధుడు వాసిరెడ్డి రమేశ్‌బాబు నుంచి రూ.25 లక్షలు ఆమె వసూలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ వ్యవహారంలో వివరాలను రాబట్టేందుకు అరుణను రెండురోజులపాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఒంగోలు జైల్లో ఉన్న ఆమెను గురు,శుక్రవారాల్లో విచారించడానికి కోర్టు అనుమతించింది. గురువారం అరుణను తీసుకొచ్చేసరికి సాయంత్రం కావడంతో విచారణ సాధ్యంకాలేదు. దీంతో శుక్రవారం ఒక్కరోజే విచా రించారు. పోలీసులు ఆమెకు మొత్తం 50 ప్రశ్నలు సంధించారు. వాటిలో ఏఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. విచారణ అనంతరం అరుణను కోర్టులో హాజరుపరిచి, ఒంగోలు జైలుకు తరలించారు.