Share News

Nellore Police: ముగిసిన కిలేడీ విచారణ

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:45 AM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు జిల్లాకు చెందిన కి‘లేడీ’ నిడిగుంట అరుణ విచారణ ముగిసింది. మూడవ రోజు శనివారం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు.

Nellore Police: ముగిసిన కిలేడీ విచారణ

  • నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే హత్యకు కుట్ర సహా శ్రీకాంత్‌ పెరోల్‌పై ప్రశ్నించిన ఎస్పీ!

  • 3 రోజుల్లో 90 ప్రశ్నలు సంధించిన అధికారులు

  • ఎక్కువ వాటికి తెలియదని సమాధానం

నెల్లూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు జిల్లాకు చెందిన కి‘లేడీ’ నిడిగుంట అరుణ విచారణ ముగిసింది. మూడవ రోజు శనివారం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. ప్రధానంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చంపితే డబ్బే డబ్బు అని రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో వైరల్‌ కావడంతో ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. ఈ వీడియోలో ఉన్న రౌడీషీటర్లకు జీవి త ఖైదీగా ఉన్న శ్రీకాంత్‌, అరుణలతో సంబంధాలు ఉండటంతో పోలీసులు ఆదిశగా విచారణ చేశారు. శ్రీకాంత్‌ పెరోల్‌పై విడుదలైంది ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని చంపడానికేనన్న ప్రచారం తెరమీదికిరావడంతో దీనిలో నిజానిజాలు తెలుసుకోవడానికి ఎస్పీ కృష్ణకాంత్‌ నేరుగా రంగంలోకి దిగారాని తెలిసింది. ఈ క్రమంలో ఎస్పీ శనివారం సాయంత్రం కోవూరు స్టేషన్‌కు వెళ్లి అరుణను గంటకు పైగా విచారించారు. విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఎమ్మెల్యే హత్యకు నిజంగా ఏదైనా కుట్ర జరుగుతోందా..? అనే కోణంలో ఎస్పీ విచారించినట్టు తెలిసింది. అదేవిధంగా శ్రీకాంత్‌ పెరోల్‌ విషయంపైనా ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే.. కోటంరెడ్డిని చంపాల్సిన అవసరం తమకు లేదని, పెళ్లి చేసుకునేందుకే పెరోల్‌ కోసం ప్రయత్నించామని అరుణ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. మొత్తంగా మూడు రోజుల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు మొత్తం 90 ప్రశ్నలు అడిగారు. ‘‘మీ నేరసామ్రాజ్యం విస్తరణకు ఎవరు సహకరించారు?.’’ అనే అంశంపై సమాధానం రాబట్టడానికి పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


ఈ ప్రశ్నకు సంబంధించి శనివారం కూడా అరుణ పలువురి పేర్లను ప్రస్తావించినట్లు తెలిసింది. వీటిలో రాజకీయ నాయకులతో పాటు పోలీసు అధికారుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, ఎక్కువ ప్రశ్నలకు ఆమె తెలియదని, మరిచిపోయానని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మరోవైపు, మూడు రోజుల విచారణ ముగియడంతో శనివారం సాయంత్రం అరుణను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఆమెను ఒంగోలు జైలుకు తరలిస్తారు. శనివారం జరిగిన విచారణలో ఎస్పీ కృష్ణకాంత్‌, ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, డీఎస్పీ శ్రీనివాసులు, ఒంగోలు డీఎస్పీలు అరుణ నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

Updated Date - Aug 31 , 2025 | 04:46 AM