SIT Investigation: కిలేడీ అరాచకాలెన్నెన్నో
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:51 AM
కి‘లేడీ’ నిడిగుంట అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని ఓ ఇంటికి వెళ్లి దొమ్మీ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసు విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి
కోవూరులోని ఓ ఇంటికెళ్లి దొమ్మీ చేసిన వ్యవహారం తాజాగా వెల్లడి
అరుణ నేరాల చిట్టా విప్పిన అనుచరులు!
రెండ్రోజుల క్రితం ‘ఆయుధాల చట్టం’ కింద కేసు
రెండు హత్యల్లోనూ ఆమె పాత్రపై అనుమానాలు
నేరాలపై సిట్ తరహాలో పూర్తిస్థాయి విచారణ!
పోలీసు విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి.. కోవూరులోని ఓ ఇంటికెళ్లి దొమ్మీ
కోవూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కి‘లేడీ’ నిడిగుంట అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని ఓ ఇంటికి వెళ్లి దొమ్మీ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరుణ అనుచరులను ఇటీవల రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని చేసిన విచారణలో ఈ విషయం బయటపడినట్లు తెలిసింది. నెల్లూరులోని వెంకటేశ్వరపురం కాలనీకి చెందిన పల్లం వేణు, అంకెం రాజా, షేక్ అప్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేష్, ఎలీషాలను పోలీసులు విచారించారు. అరుణ నేరాల చిట్టా గురించి వారు చెప్పిన విషయాలను విన్న పోలీసులు విస్తుపోయిన్నట్టు తెలిసింది.
అరుణ నేరాల చిట్టా ఇదిగో..
అరుణపై ఇటీవల నెల్లూరులోని నవాబుపేట పోలీసుస్టేషన్‌లో ఆయుధాల చట్టం కింద ఓ కేసు నమోదైంది. గతంలో అన్నాదమ్ముళ్ల ఆస్తి వివాదంలో అన్న తరఫున తమ్ముడిని తుపాకీతో అరుణ బెదిరించినట్లు సమాచారం. ఒంగోలు జైలులో రిమాండు ఖైదీగా ఉన్న ఆమెను నవాబుపేట పోలీసులు పీటీ వారంటుపై కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు తాజాగా కోవూరులో వెలుగులోకి వచ్చిన నేరంపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయవాడలో ఓ నిరుద్యోగ యువకుడిని మోసం చేసినందుకు కోవూరులోనే కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొడవలూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హిజ్రా హత్య కేసులోనూ అరుణ ప్రమేయముందని భావిస్తున్నారు. ఒంగోలులో జరిగిన ఓ హత్య కేసులోనూ ఆమె పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన ఓ యువకుడి అనుమానాస్పద మృతి కేసును పునర్విచారణ చేయనున్నట్లు తెలిసింది. కోవూరు మండలంలో గిరిజన మహిళలను మోసగించిందనే కేసును పరిశీలిస్తున్నారు. నెల్లూరు ‘దిశ’ పోలీసుస్టేషన్ కేంద్రంగా సాగిన అక్రమాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు!
రౌడీషీటరు శ్రీకాంత్ పెరోల్ విషయమై అరుణ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. అరుణ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ డీజీపీ కార్యాలయం నుంచే నెల్లూరు అధికారులకు ఆదేశాలు అందుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు నేరాల విషయాన్ని రాష్ట్ర కేంద్రానికి చేరవేస్తున్నారు. ఆయుధాల చట్టంతో పాటు 2-3 హత్య కేసులు కూడా అరుణపై త్వరలోనే నమోదయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేరాలపై ‘సిట్’ తరహా విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని కొంతమంది అధికారులు అంటున్నారు. గతంలో నెల్లూరు ఎస్పీగా పనిచేసిన పీహెచ్‌డీ రామకృష్ణను ప్రత్యేకాధికారిగా నియమించారని ప్రచారం సాగుతోంది.
హోంమంత్రి అయ్యేందుకే అనుచరులు
హోంమంత్రి కావాలనే లక్ష్యంతో అరుణ సాగించిన దందా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఆపై హోంమంత్రి అయ్యేందుకు జిల్లాలో అనుచరులను తయారు చేయడంపై ఆమె దృష్టి పెట్టినట్లు విచారణలో అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఆ అనుచరుల వివరాలను కూడా ఇప్పుడు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అరుణ నేరాల కూపీని పూర్తిగా తెలుసుకుంటేనే చర్యలు తీసుకొనే అవకాశముందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.