Share News

Nidigunta Aruna: వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:44 AM

గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని కి‘లేడీ’ నిడిగుంట అరుణ పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఆ ప్రభుత్వంలో ఉండి, ప్రస్తుతం అధికార కూటమిలోనూ...

Nidigunta Aruna: వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే

  • పోలీసుల ఎదుట కి‘లేడీ’ అరుణ అంగీకారం

  • గత ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు,ఉన్నతాధికారులతో పరిచయాలు

  • ఆ ప్రభుత్వంలో ఉండి, కూటమిలోనూ

  • కొనసాగుతున్న ఇద్దరు, ముగ్గురితోనూ.. ‘కీలక’ వివరాలు సేకరించిన పోలీసులు

  • రెండో రోజు ఏడు గంటలపాటు విచారణ

నెల్లూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని కి‘లేడీ’ నిడిగుంట అరుణ పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఆ ప్రభుత్వంలో ఉండి, ప్రస్తుతం అధికార కూటమిలోనూ కొనసాగుతున్న ఇద్దరు, ముగ్గురితోనూ సంబంధాలు ఉన్నట్టు ఆమె అంగీకరించినట్లు సమాచారం. పలు నేరాలకు సంబంధించి రిమాండ్‌ ఖైదీగా ఉన్న అరుణను మూడు రోజులపాటు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం ఆమెను ఒంగోలు జైలు నుంచి నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే కాలాతీతం కావడంతో గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారంతో విచారణ సరిపెట్టారు. రెండోరోజు శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నెల్లూరు ఏఎస్‌పీ సీహెచ్‌ సౌజన్య, నెల్లూరు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు, ఒంగోలు పోలీసు అధికారులు కోవూరు స్టేషన్‌లో అరుణను ఆమె న్యాయవాదుల సమక్షంలో విచారించారు. ఈ విచారణకు ముందే అరుణ నేరచరిత్రకు సంబంధించి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో అన్ని పోలీస్‌ స్టేషన్ల నుంచి సమాచారం సేకరించారు. గత ప్రభుత్వంలో అరుణ పోలీ‌స్ స్టేషన్లు వేదికగా సెటిల్‌మెంట్లు, లాబీయింగ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు దగ్గరగా ఉన్న జీడీహెచ్‌ (సీఐలకు సహాయకులు) ద్వారా అరుణ ఎప్పుడు ఏ స్టేషన్‌కు వెళ్లారు... ఏ ఫిర్యాదుపై వెళ్లారు...ఆ ఫిర్యాదు పూర్వాపరాలు ఏమిటి అనే వివరాలతో ప్రశ్నావళిని సిద్ధం చేసుకొని, దాని ఆధారంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది. అధికారులు, రాజకీయ నాయకుల్లో తనకు ఎవరెవరితో పరిచయాలున్నది ఆమె వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.


గత వైసీపీ ప్రభుత్వంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనకు మంచి పరిచయాలు ఉన్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసు వర్గాల సమాచారం. వారి ప్రోద్బలంతోనే నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో అరుణకు సంబంధించిన న్యాయవాదులు పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెలుపలికి వచ్చేశారు. ఆ తర్వాత సుమారు గంటన్నరకుపైగా పోలీసుల అధికారుల ఎదుట పలు వివరాలను అరుణ వెల్లడించినట్లు తెలిసింది. ఆ సమయంలోనే రాజకీయ, ఉన్నతాధికారులతో తనకు ఉన్న పరిచయాలను ఆమె వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. శుక్రవారం విచారణలో అరుణ నుంచి చాలా విషయాలు సేకరించామనే సంతృప్తిని ఓ పోలీస్‌ అధికారి వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, తమను పోలీసులు విచారణ గదినుంచి వెలుపలికి పంపివేశారని ఆరోపిస్తూ అరుణ తరపు న్యాయవాది కోవూరు కోర్టులో మెమో వేయడం మరో విశేషం.

Updated Date - Aug 30 , 2025 | 10:13 AM