NHRC Orders: ఆ స్లీపర్ బస్సులను పక్కన పెట్టండి
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:59 AM
దేశంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది.
అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలు
న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలపై అందిన ఫిర్యాదులపై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించింది. ఇందులో ఓ పిటిషన్‌పై మానవ హక్కుల రక్షణ చట్టం-1993, సెక్షన్ 12 కింద మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో విచారణ చేపట్టారు. ఈ పిటిషన్‌లో, ‘‘ప్రైవేట్ స్లీపర్ బస్సుల రూపకల్పనలో లోపాల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణికుల కంపార్ట్‌మెంట్ నుంచి పూర్తిగా వేరు చేయబడి ఉంటోంది. దీనివల్ల ప్రమాదాల సమయంలో డ్రైవర్ తప్పించుకుంటుండగా.. ప్రయాణికులు మాత్రం మంటల్లో చిక్కుకుని మరణిస్తున్నారు. ప్రమాదాన్ని ప్రయాణికులు సకాలంలో గుర్తించకుండా అడ్డంకిగా మారుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే ప్రాథమిక హక్కును కాలరాయడమే. ఈ ఘటనలు బస్సులను తయారుచేసే కంపెనీలు, వాటి ఫిట్‌నెస్‌ను ఆమోదించే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.’’ అని పిటిషనర్ పేర్కొన్నారు.