School Education Department: 13 నుంచి విధులకు కొత్త టీచర్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:41 AM
మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
వచ్చే నెల 3 నుంచి 10 వరకు శిక్షణ.. పాఠశాల విద్యా శాఖ నిర్ణయం
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అ సమయంలోనే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టులు ఇస్తారు. ఆ తర్వాత 13నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరుకానున్నారు. మరోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబరు 25 వరకు తెలపవచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు 15రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తాయన్నారు. అభ్యర్థులు జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్రస్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చని, రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయంపైనా సంతృప్తి చెందకపోతే తుది అప్పీలేట్ అథారిటీ(పాఠశాలవిద్య డైరెక్టర్)కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది అప్పీలేట్ అథారిటీ ఈ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుందని కృష్ణారెడ్డి వివరించారు.