Auto Driver Welfare: నేడు ఆటో డ్రైవర్ల సేవలో...
ABN , Publish Date - Oct 04 , 2025 | 04:34 AM
రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం విజయవాడ వేదికగా మరో సంక్షేమ....
డ్రైవర్ల సంక్షేమం కోసం కొత్త పథకానికి నేడు శ్రీకారం
హామీ ఇవ్వకున్నా పథకం అమలుకు నిర్ణయం
క్యాబినెట్‌లో భేటీలో ఏకగ్రీవ ఆమోదం
ఆటో, క్యాబ్, ట్యాక్సీ వాహనదారులు 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి
ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున జమ
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో డ్రైవర్ల ఆర్థిక సమస్యలు తగ్గించడమే లక్ష్యం
విజయవాడ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం విజయవాడ వేదికగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆటో, క్యాబ్, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉండి.. వాటిని నడుపుకొంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంతో ఆటో, క్యాబ్, ట్యాక్సీలకు గిరాకీ తగ్గింది. దీంతో వారంతా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో వారి ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు.. ‘‘మీరు ఆందోళన చెందవద్దు. మీకూ సంక్షేమ పథకం ప్రవేశపెడతా.’’ అని అనంతపురం జిల్లాలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్‌హిట్’ సభలో ప్రకటించారు. అంతేకాదు, ఈ పథకాన్ని దసరా నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ వేదికగా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడ, అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున రూ.436 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
అత్యధికం విశాఖకే!
ఈ పథకంలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు రూ.34.43 కోట్ల లబ్థి కలగనుంది. నెల్లూరులో 17,405 మందికి రూ.26.10 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 16,405 మందికి రూ.24.60 కోట్లు, విజయనగరంలో 15,479 మందికి రూ.23.21 కోట్లు, శ్రీకాకుళంలో 13,887 మందికి రూ.20.83 కోట్లు, అనకాపల్లిలో 13,753 మందికి రూ.20.62 కోట్లు, కర్నూలులో 13,495 మందికి రూ.20.24 కోట్లు, గుంటూరులో 13,204 మందికి 19.80 కోట్లు, తిరుపతి జిల్లాలో 13,125 మందికి రూ.19.68 కోట్లు, కాకినాడలో 12,966 మందికి రూ.19.44 కోట్లు, తూర్పుగోదావరిలో 11,915 మందికి రూ.17.87 కోట్లు, కడపలో 11,456 మందికి రూ.17.18 కోట్లు, ప్రకాశంలో 11,356 మందికి రూ.17.03 కోట్లు, కృష్ణాలో 11,316 మందికి రూ. 16.97 కోట్లు, ఏలూరులో 10,655 మందికి రూ.15.98 కోట్లు, నంద్యాలలో 9,569 మందికి రూ.14.35 కోట్లు, అనంతపురంలో 9,275 మందికి రూ.13.91 కోట్లు, పల్నాడులో 8,884 మందికి రూ.13.32 కోట్లు, పశ్చిమ గోదావరిలో 8,489 మందికి రూ.12.73 కోట్లు, కోనసీమలో 7,709 మందికి రూ.11.56 కోట్లు, బాపట్లలో 6,859 మందికి రూ.10.28 కోట్లు, చిత్తూరులో 6,777 మందికి రూ.10.16 కోట్లు, పార్వతీపురంమన్యం జిల్లాలో 4,963 మందికి రూ.7.44 కోట్లు, అల్లూరి జిల్లాలో 4,217 మందికి రూ.6.32 కోట్ల మేర నిధులు జమ చేయనున్నారు.