Rayapati Sailaja: మహిళా కమిషన్‌కు త్వరలో వెబ్‌సైట్
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:59 AM
రాష్ట్ర మహిళా కమిషన్‌కి ఇప్పటి వరకూ వెబ్‌సైట్ లేదు. త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. అలాగే ప్రస్తుత టోల్‌ఫ్రీ నంబరులోని అంకెలు తగ్గించి...
సులభంగా గుర్తుండేలా కొత్త టోల్ ఫ్రీ నంబర్ తెస్తాం: రాయపాటి శైలజ
రాజమహేంద్రవరం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర మహిళా కమిషన్‌కి ఇప్పటి వరకూ వెబ్‌సైట్ లేదు. త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. అలాగే ప్రస్తుత టోల్‌ఫ్రీ నంబరులోని అంకెలు తగ్గించి సులభంగా గుర్తుండే విధంగా నూతన నంబరును అందుబాటులోకి తెస్తాం’ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళా భద్రతపై నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘స్కూళ్లల్లో విద్యపైనే దృష్టి పెడుతున్నాం. హక్కులు, బాధ్యతలను తెలియచేసే, వాస్తవిక దృక్పథాన్ని పెంచే అంశాలనూ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మోరల్ క్లాసెస్ ఉండేవి. వాటిని పునరుద్ధరించాల్సిన ఆశ్యకత నేడు ఉంది. కారణాలేమైనా గృహ హింస కేసుల సంఖ్య పెరిగింది. ఆడపిల్లలు పెద్దలు చెప్పినా వినిపించుకోకుండా సోషల్ మీడియా, ఆన్‌లైన్ స్నేహాలు అంటూ చదువుకోవాల్సిన వయసులో తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమ్మాయి, అబ్బాయి ఎలా నడుచుకోవాలి? ఎలా గౌరవించుకోవాలి? వంటి అంశాలపై ఇంట్లో పెద్దలు కూడా వారికి చెప్పాలి’ అని శైలజ సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్లలో 90 శాతం మహిళా ఉద్యోగులు, కౌన్సెలర్లు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సిఫారసు చేశాం’ అని చైర్‌పర్సన్ తెలిపారు.