Share News

Drug Trafficking: ర్యాపిడో... స్విగ్గీ... జొమాటో...మత్తు సరఫరాకు మడ్డీ మార్గాలు

ABN , Publish Date - Nov 11 , 2025 | 05:38 AM

ఎండీఎంఏను తరలిస్తూ విజయవాడలో సెప్టెంబరులో ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడిన ప్రేమికుల కేసులో కొత్త ట్విస్ట్‌ బటయపడింది.

Drug Trafficking: ర్యాపిడో... స్విగ్గీ... జొమాటో...మత్తు సరఫరాకు మడ్డీ మార్గాలు

  • ఎండీఎంఏను సమకూర్చిన నైజీరియన్‌

  • డ్రగ్స్‌ను తరలిస్తూ దొరికిన ప్రేమికుల కేసులో కొత్త ట్విస్ట్‌

విజయవాడ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎండీఎంఏను తరలిస్తూ విజయవాడలో సెప్టెంబరులో ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడిన ప్రేమికుల కేసులో కొత్త ట్విస్ట్‌ బటయపడింది. మధుసూదన్‌రెడ్డి బెంగళూరులో ర్యాపిడో... స్విగ్గీ... జొమాటో డెలివరీ బోయ్‌ ముసుగులో భారీగా డ్రగ్స్‌ విక్రయించేవాడని తెలిసింది. జీవనోపాధి పొందుతున్నట్టుగా పైకి కనిపిస్తూనే, చీకట్లో అనేక వ్యవహారాలు చక్కబెట్టేవాడు. మాదకద్రవ్యాల కేసులో జరిగిన అరెస్టులతో సరిపెట్టుకోవద్దని, ఎంతదూరాన ఉన్నా వాటి మూలాలను ఎలాగైనా బయటకు లాగాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు అధికారులను కొద్దిరోజుల క్రితం ఆదేశించారు. కేసుల్లో నిందితులుగా ఉంటూ చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు....ఒక్కొక్కరిని ఏరి బయటకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే మధుసూదన్‌రెడ్డికి సంకెళ్లు వేశారు. అతడిని విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. మధుసూదన్‌రెడ్డి బీటెక్‌ చదువును సగంలోనే వదిలేసి ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. అక్కడ ర్యాపిడో, స్విగ్గీ, జుమాటో డెలివరీ సంస్థల్లో చేరాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో డ్రగ్స్‌ అమ్ముతున్న ఓ నైజీరియన్‌తో పరిచయమైంది. అప్పటినుంచి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలను అడిగిన వారికి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. దీనికోసం 10-15 డ్రాపింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకున్నాడు. డ్రగ్స్‌ను తీసుకొచ్చి డ్రాపింగ్‌ పాయింట్లలో కొనుగోలుదారులకు అందజేసి కమీషన్‌ తీసుకునేవాడు. కొన్నిసార్లు కొనుగోలుదారులను కలిసి స్వయంగా అందజేసేవాడు. డ్రాపింగ్‌ పాయింట్ల వద్ద తుప్పలు, గడ్డిలో సరుకుని వదిలిపెట్టి వెళ్లేవాడు. ఆ ఫొటోలను వాట్సాప్‌లో కొనుగోలుదారులకు పంపేవాడు. కేసులో ఇప్పటివరకు ప్రాథమికంగా జరిగిన దర్యాప్తును బట్టి అసలు సూత్రధారి మధుసూదన్‌రెడ్డి అని అంతా భావించారు. ఇప్పుడు బెంగళూరులో విద్యార్థి వీసాపై ఉన్న నైజీరియన్‌ ఈ డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అతడితో మధుసూదన్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. మధుసూదన్‌రెడ్డి మాదకద్రవ్యాలను కొనుగోలుచేసే వారితో ఒక వాట్సాప్‌ గ్రూపు నడిపేవాడు. ఆర్డర్లను బట్టి డ్రగ్స్‌ను అందిస్తూ, డబ్బులను పేమెంట్‌ యాప్‌ల ద్వారా స్వీకరించేవాడు. ఆర్డర్‌ ప్రకారం నైజీరియన్‌కు వాట్సాప్‌లో హాయ్‌ అని సందేశం పంపేవాడు. స్పందన రాగానే ఆర్డర్‌ విషయాన్ని చెప్పేవాడు. అతడు స్కానర్‌ను వాట్సాప్‌లో పంపగానే డ్రగ్స్‌ ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని చెల్లించేవాడు. ఈ డ్రగ్స్‌ను మధుసూదన్‌రెడ్డికి అందజేయడానికి నైజీరియన్‌ కొన్ని డ్రాపింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకునేవాడని పోలీసులు తెలిపారు.


వైసీపీ విద్యార్థి నేత కొండారెడ్డితో మధుసూదన్‌రెడ్డి బంధం..

ఎండీఎంఏను తరలిస్తూ పట్టుబడిన ప్రేమికుల కేసులో వైజాగ్‌కు చెందిన వైసీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కొద్దిరోజుల క్రితమే వైజాగ్‌లోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎండీఎంఏతో కొండారెడ్డి, మరికొంతమందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు తాజాగా కొత్త పురోగతి కనిపించింది. సెప్టెంబరులో ట్రావెల్స్‌ బస్సులో డ్రగ్స్‌ను వైజాగ్‌కు తీసుకెళ్తూ ఇంజనీరింగ్‌ విద్యార్థి అర్జా శ్రీవాత్సవ్‌, అతడి ప్రియురాలు హవిలా డిలైట్‌ పట్టుబడడం, వారిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. దర్యాప్తులో వైజాగ్‌కు చెందిన జోగా లోహిత్‌ యాదవ్‌, స్వరూపరాజు అనే ఇద్దరు యువకుల పాత్ర ఈ కేసులో ఉన్నట్టు తెలిసింది. మత్తు ప్రేమికులు దొరికిపోగానే స్వరూపరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. లోహిత్‌ యాదవ్‌ను పట్టుకున్న తర్వాత తాజాగా బెంగళూరులో పోలీసులకు చిక్కిన మధుసూదన్‌రెడ్డి పేరు బయటపడింది. ఈ నిందితుల కాల్స్‌ డేటాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విశ్లేషిస్తున్న క్రమంలోనే కొండారెడ్డి ఉపయోగించిన ఫోన్‌ నంబరును గుర్తించారు. లోహిత్‌ యాదవ్‌తో కొండారెడ్డి పలుమార్లు వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా మాట్లాడినట్టు తెలిసింది. వైజాగ్‌ కేంద్రంగా జరిగిన పార్టీలకు అవసరమైన డ్రగ్స్‌ను కొండారెడ్డి మధుసూదన్‌రెడ్డి నుంచి రప్పించినట్టు తెలుస్తోంది. లోహిత్‌ ఫోన్‌లో ఉన్న కొండారెడ్డి ఫోన్‌ నంబరును గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌, సెంట్రల్‌ జోన్‌ పోలీసులు...వైజాగ్‌లోని టాస్క్‌ఫోర్స్‌లను సంప్రదిస్తూ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 05:40 AM