Ram Mohan Naidu: సామాన్యుల చేరువలోకి విమాన ప్రయాణం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:03 AM
విమానయానాన్ని సాధారణ ప్రజల ప్రయాణ సాధనంగా మార్చడం కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
గన్నవరంలో త్వరలో కొత్త టెర్మినల్: రామ్మోహన్ నాయుడు
గన్నవరం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : విమానయానాన్ని సాధారణ ప్రజల ప్రయాణ సాధనంగా మార్చడం కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విమాన ప్రయాణికులకు తక్కువ ధరకు అల్పాహారం, తాగునీరు అందించేందుకు ఉడాన్ యాత్రి కేఫ్‌ను విజయవాడ విమానాశ్రయంలో ఎంపీ, గన్నవరం ఎయిర్‌పోర్టు సలహామండలి వైస్ చైర్మన్ కేశినేని శివనాథ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు టీ, సమోస అందజేసి కొద్దిసేపు వారితో ముచ్చటించారు. విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కొత్త టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేశామని, మరో రెండు, మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. విమాన చార్జీలు తగ్గడంతో మధ్యతరగతి ప్రయాణికులు గణనీయంగా పెరిగారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. త్వరలోనే అహ్మదాబాద్, వారాణసీ, కొచ్చి, ఫుణె నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఏఐ (హెచ్‌ఆర్) సభ్యుడు హెచ్.శ్రీనివాస్, ఏఏఐ (ఆపరేషనల్) సభ్యుడు శరద్‌కుమార్, విమానాశ్రయం డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు.