PVN Madhav: మరో స్వదేశీ ఉద్యమం రావాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:41 AM
ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే మరో స్వదేశీ ఉద్యమం అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
స్వయం సమృద్ధితో బలమైన శక్తిగా దేశం
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి
యువతను ఆకర్షిస్తున్న మోదీ పాలన
ప్రతి ఇంటా బీజేపీ జెండా ఎగరాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
పరిశ్రమలతో రాయలసీమ అభివృద్ధి: టీజీ వెంకటేశ్
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే మరో స్వదేశీ ఉద్యమం అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కళాశాల విద్యార్థులకు స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన కల్పించాలన్నారు. సోమవారం కర్నూలులో జరిగిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులతో మాట్లాడారు. స్వదేశీతోనే స్వయం సమృద్ధి సాధ్యమని, తద్వారా భారత కీర్తి విశ్వవాప్తం కావటంతో పాటు ప్రపంచాన్ని శాసించే బలీయమైన శక్తిగా దేశం అవతరిస్తుందన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే చేనేత, హస్తకళలను ఆదరించి, ఎగుమతులను ప్రోత్సాహించాలన్నారు. ప్రధాని మోదీ పాలనా విధానాల పట్ల యువత ఎంతో ఆకర్షితులు అవుతున్నారని, వారిని పార్టీలో భాగస్వాములు అయ్యేలా చైతన్య వంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ అనేది ప్రధాని మోదీ చేపట్టిన గొప్ప సంస్కరణ అని తెలిపారు. ప్రతి మారుమూల గ్రామంలోని ప్రతి ఇంటా బీజేపీ జెండా ఎగరాలని, దేశానికి బీజేపీ ఎంత అవసరమో ప్రజలకు అర్థమయ్యేలా తెలపాలని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం ఎంతో వెనకబడి ఉందని, దీనిపై ఎన్నో పోరాటాలు చేశామన్నారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఏర్పాటు చేసి చాలా వరకు సాధించుకున్నామని, దాని ఫలితంగానే పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయని అన్నారు.