Higher Education: కొత్త సింగిల్ మేజర్‌విధానంలోకి మారాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:35 AM
సింగిల్ మేజర్ డిగ్రీ నుంచి కొత్త సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలోకి మారేందుకు డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీచేసింది.
డిగ్రీ కోర్సుల్లో ప్రస్తుత సీట్ల సంఖ్యనే కొనసాగింపు
నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి మారడంపై ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సింగిల్ మేజర్ డిగ్రీ నుంచి కొత్త సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలోకి మారేందుకు డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత సింగిల్ మేజర్ విధానం నుంచి 2025-26లో అమలు చేయబోయే నూతన సింగిల్ మేజర్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి మారాలని స్పష్టం చేసింది. కన్వర్షన్ కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. 25 నుంచి 27 వరకు రూ.7 వేలు, 28 నుంచి 30 వరకు రూ.10 వేల జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఈనెల 25 నుంచి 31 వరకు ప్రతిపాదనల పరిశీలన జరుగుతుందని, ఆగస్టు 1న అనుమతులు జారీ అవుతాయని వెల్లడించింది. ఇటీవల డ్యూయెల్ మేజర్ కన్వర్షన్ కోసం ఫీజులు చెల్లించిన కాలేజీలు మళ్లీ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రతి కోర్సులో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యనే యథావిధిగా మార్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత కోర్సు నుంచి కొత్త కోర్సులోకి మారాలంటే అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నట్లు చూపించాలని తెలిపింది. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు జారీచేస్తున్నందున.. ఆ సంస్థ అనుమతి లేకుండా ఆ కోర్సులకు మార్చుకోవడం కుదరని పేర్కొంది. 2024-25 విద్యాసంవత్సరంలో డిజిటల్ అఫిలియేషన్ పొందిన కాలేజీలకు మాత్రమే కన్వర్షన్‌కు అవకాశం ఉంటుందని, డిజిటల్ అఫిలియేషన్ లేని కాలేజీలు ప్రొవిజినల్ అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అన్ని కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటాయని తెలిపింది. బీకాం, బీకాం(సీఏ), బీబీఏ, బీసీఏ, బీ ఒకేషనల్, ఏఈడీపీ కోర్సులకు కన్వర్షన్ ప్రతిపాదనలు అవసరం లేదని పేర్కొంది. సాధారణ డిగ్రీ కాలేజీలు కోర్సులను హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోకి మార్చుకోవడం కుదరదని స్పష్టం చేసింది.