Mines Department Order: రైల్వే పనులకు సీనరేజీలో వెసులుబాటు
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:15 AM
రైల్వే పనులకు పెద్ద ఊరట లభించింది. రైల్వే వర్క్‌లకాంట్రాక్ట్ సంస్థలు, ఏజెన్సీలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజాల సీనరేజీ చెల్లించాల్సిన అవసరం...
కాంట్రాక్టర్లు నేరుగా చెల్లించనక్కర్లేదు.. గనుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రైల్వే పనులకు పెద్ద ఊరట లభించింది. రైల్వే వర్క్‌లకాంట్రాక్ట్ సంస్థలు, ఏజెన్సీలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజాల సీనరేజీ చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గనులు, ఖనిజాల నిబంధనల్లో సవరణ తీసుకొస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు (జీఓ 262)జారీ చేశారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ వర్క్‌కు అయినా మట్టి, కంకర, ఇతర ఖనిజాలు అవసరం ఉంటే, కాంట్రాక్టర్ ప్రభుత్వానికి సీనరేజీ, ఇతర చార్జీలు చెల్లించి తీసుకెళ్లాలి. జాతీయ రహదారులు, స్టేట్ హైవేల విషయంలోనూ మొన్నటి వరకు ఇదే నిబంధన ఉంది. అయితే, దీనివల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వర్క్‌లకు అనుసరిస్తున్న విధానాన్ని రైల్వే పనులకు అమలు చేయాలని నిర్ణయించారు. ఫీజులను కాంట్రాక్టర్‌కు చెల్లించే బిల్లులోనుంచి మినహాయించుకొని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే విధానం రహదారుల పనుల్లో ఉంది. దీనివల్ల కాంట్రాక్ట్ సంస్థ నేరుగా ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించే అవసరం లేదు. ఇప్పుడు ఇదే చెల్లింపు విధానం రైల్వే వర్క్‌లకు కూడా అమలు చేయనున్నారు. ఇకపై కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే సమయంలోనే రైల్వే శాఖ సీనరేజీ ఫీజులు మినహాయించుకొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. దీంతో వర్క్‌లు వేగంగా జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి.