Drug Racket: డ్రగ్స్ దందాకు నాలుగు ఫోన్ నంబర్లు
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:51 AM
విద్యార్థులు, యువతే లక్ష్యంగా డగ్స్ దందా చేసిన వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
బెంగళూరులో ముగ్గురు ఏజెంట్ల ద్వారా నార్కోటిక్స్
పోలీసు విచారణలో బయటపడుతున్న కొండారెడ్డి లీలలు
నేటితో ముగియనున్న వైసీపీ విద్యార్థి నేత కస్టడీ
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
విద్యార్థులు, యువతే లక్ష్యంగా డగ్స్ దందా చేసిన వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం నాలుగు ఫోన్ నంబర్లను నార్కోటిక్ డ్రగ్స్ కోసం అతను వినియోగించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం జైలులో ఉన్న కొండారెడ్డిని విజయవాడ మాచవరం పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. విశాఖకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆర్జా శ్రీవాత్సవ్, ఇంజనీరింగ్ పట్టభద్రురాలు హవిలా డిలైట్ బెంగళూరు నుంచి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తీసుకెళ్తుండగా విజయవాడలో ఈగల్ టీం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టడానికి కొండారెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. బెంగళూరులోని మల్లెల మధుసూదన్‌రెడ్డి నుంచి కొండారెడ్డి డ్రగ్స్‌ను రప్పించుకునేవాడు. విశాఖపట్నంలో యువత పుట్టినరోజు పార్టీలకు ఈ డ్రగ్‌ను సరఫరా చేసేవాడు. బెంగళూరులో మరో ముగ్గురు ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసమే కొండారెడ్డి మొత్తం నాలుగు ఫోన్ నంబర్లు ఉపయోగిస్తున్నాడని గుర్తించారు. తన చేతికి మట్టి అంటుకోకుండా కొండారెడ్డి ఈ నంబర్లను స్నేహితుల చేతుల్లో పెట్టినట్టు అనుమానిస్తున్నారు. కొండారెడ్డి పోలీసు కస్టడీ బుధవారంతో ముగుస్తుంది. అనంతరం అతడికి ఎంఎస్‌జే కోర్టులో హాజరుపరుస్తారు.