RainFall: మొదలైన నైరుతి నిష్క్రమణ
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:13 AM
ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి...
మూడు రోజులు ముందుగానే..
20న మరో అల్పపీడనం?
విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. సాధారణంగా సెప్టెంబరు 17న ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించాల్సి ఉంది. అక్కడ అధికపీడనం ఏర్పడడం, గడచిన ఐదు రోజుల నుంచి అక్కడ వర్షాలు లేకపోవడం, గాలిలో తేమ శాతం తగ్గడం తదితరాలను పరిగణనలోకి తీసుకొని 3 రోజులు ముందే నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గతేడాది సెప్టెంబరు 23న రుతుపవనాలు నిష్క్రమణ ప్రారంభమై అక్టోబరు 15 నాటికి దేశం నుంచి పూర్తిగా వైదొలిగాయి. 2015లో సెప్టెంబరు 4న, 2016లో సెప్టెంబరు 15న నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ ఏడాది మే 24న కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. జూన్ 29వ తేదీకల్లా దేశవ్యాప్తంగా విస్తరించాయి. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో భాగంగా జూన్ 1 నుంచి సెప్టెంబరు 14 వరకు 790.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 846.4 మి.మీ.(7 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది.
నేడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర తెలంగాణ, విదర్భ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మధ్యకోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కొన్ని మోడళ్ల మేరకు ఇది 20వ తేదీకి అల్పపీడనంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.