Share News

Excise Department: కొత్త బ్రాండ్లకు బ్రేక్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:52 AM

రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్త బ్రాండ్ల మద్యానికి అనుమతి అంశంపై ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.

Excise Department: కొత్త బ్రాండ్లకు బ్రేక్‌

  • ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలకు సీఎం తిరస్కరణ

  • ప్రస్తుతానికి కొత్తవి అవసరం లేదని నిర్ణయం

  • జగన్‌ ప్రభుత్వంలో ‘సిమిలర్‌ సౌండింగ్‌’ బ్రాండ్లతో దోపిడీ

  • కమీషన్ల రూపంలో పెద్ద మొత్తం దారి మళ్లించారన్న సిట్‌

  • అదే తప్పు పునరావృతం కాకూడదని భావిస్తున్న ప్రభుత్వం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్త బ్రాండ్ల మద్యానికి అనుమతి అంశంపై ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వాటిపై ఇటీవల నిర్వహించిన కేబినెట్‌ భేటీలో చర్చ జరగ్గా కొత్త బ్రాండ్లు అవసరం లేదని సీఎం తిరస్కరించినట్లు తెలిసింది. కొత్తగా ప్రతిపాదించిన బ్రాండ్లలో చాలావరకూ సిమిలర్‌ సౌండింగ్‌ బ్రాండ్లే ఉన్నాయి. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్ల పేర్లకు చిన్నపాటి మార్పులు చేసి కొత్త పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా స్వల్ప మార్పులతో వచ్చినా వాటిని కొత్త బ్రాండ్లుగానే పరిగణిస్తారు. వాటికి కొత్త ధరలు నిర్ణయిస్తారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కాంలో సిమిలర్‌ సౌండింగ్‌ బ్రాండ్లు కీలక పాత్ర పోషించాయి. ఉదాహరణకు బృందావన్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీస్‌ కంపెనీ బ్యాగ్‌పైపర్‌ ప్రీమియర్‌ విస్కీ అనే బ్రాండ్‌ సరఫరా చేసేది. దానికి కేసుకు రూ.696 చొప్పున ప్రభుత్వం చెల్లించేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి అదే కంపెనీ, అదే నాణ్యతతో బాగ్య్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్‌ ప్రవేశపెట్టింది. దాని ధరను రూ.1,759గా నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వానికి కేసుకు రూ.1,063 చొప్పున నష్టం వచ్చింది. ఈ మొత్తం కమీషన్ల రూపంలో దారిమళ్లినట్లు సిట్‌ చార్జ్‌షీటులో పేర్కొంది. ఇప్పుడు సిమిలర్‌ సౌండింగ్‌ బ్రాండ్లకు అనుమతిస్తే మళ్లీ అదే తప్పు చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈసారి అవే కంపెనీలు కొత్త పేర్లతో నాణ్యత తగ్గించి బ్రాండ్లను ప్రవేశపెట్టి అమ్మకాలు పెంచుకోవాలని భావించాయి.


అలాగే కొన్ని పూర్తిగా కొత్త బ్రాండ్లు వచ్చేందుకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఎలాంటి కొత్త బ్రాండ్లు అక్కర్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల ధరల సవరణ టెండర్ల అంశంకూడా కేబినెట్‌ ముందుకొచ్చింది. దీనిపై త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. టెండర్‌ కమిటీ సిఫారసులకు అనుగుణంగా వాటి ధరలను సవరించనున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికే 40 బ్రాండ్లు స్వచ్ఛందంగా ధరలు తగ్గించాయి. ప్రస్తుత ధరల కంటే ఇంకా తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కంపెనీ కొంతమేర ధర తగ్గించుకుంటే దానిపై వివిధ రకాల పన్నులు వేస్తారు కాబట్టి ఆ మేరకు అనేక రెట్లు ఆదాయం తగ్గుతుంది.

Updated Date - Aug 24 , 2025 | 03:55 AM