Pemmasani Chandrasekhar: వైసీపీ పాలనలో ఏ కంపెనీ వచ్చింది
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:12 AM
వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఫలానా ఒక కంపెనీ వచ్చిందని చెప్పగలిగే ధైర్యం ఆ మాజీలకు ఉందా?, కొత్తవాటిని తీసుకురాకపోగా రాష్ట్రంలో ఉన్నవాటిని బయటకు పంపేశారు. కానీ కూటమి పాలనలో దీనికి పూర్తి భిన్నం.
నేడు లోకేశ్ కృషితో పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహం
రానున్న రోజుల్లో వేల ఉద్యోగాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని
తెనాలి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఫలానా ఒక కంపెనీ వచ్చిందని చెప్పగలిగే ధైర్యం ఆ మాజీలకు ఉందా?, కొత్తవాటిని తీసుకురాకపోగా రాష్ట్రంలో ఉన్నవాటిని బయటకు పంపేశారు. కానీ కూటమి పాలనలో దీనికి పూర్తి భిన్నం. లోకేశ్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల ముందు చూపుతో కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం గొప్ప పరిణామం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఏటా రూ.60వేల కోట్లు ఖర్చవుతోందన్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లిస్తూ, అభివృద్ధినీ ఒక ప్రణాళికా బద్ధంగా చేసుకుంటూ పోతున్నారన్నారని వివరించారు. గత ప్రభుత్వం యువతను మత్తులో ముంచేసి, అరాచకాలకు వారిని వాడుకుంటే, నేడు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి కల్పిస్తూ, గ్రామాలలోనే ఉండి పనిచేసుకునేలా గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారన్నారని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ రాష్ట్రంలో ఐటీతో సహా, మరికొన్ని పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని, ఆయన కృషి ఫలిస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులతో రాష్ట్రం దేశంలోనే కొత్త ఒరవడి తీసుకొచ్చిందని, ఆ ఘనత మంత్రి మనోహర్‌కు దక్కుతుందని తెలిపారు.దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశేనని, దీనికి మనమంతా గర్వపడాలని పెమ్మసాని వ్యాఖ్యానించారు.