Share News

Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:25 AM

టీడీపీ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు (74) గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.మరోవైపు హరియాణా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది.

Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు

  • దత్తాత్రేయ స్థానంలో హరియాణాకు అసీం ఘోష్‌

  • లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తా

  • నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు (74) గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.మరోవైపు హరియాణా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది.ఆయనకు పొడిగింపు లభించలేదు.ఆయన స్థానంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ అసీమ్‌ కుమార్‌ ఘోష్‌ను నియమించారు. ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదముద్ర వేశారు.బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరి నియామకాలు అమల్లోకి వస్తాయి.దత్తాత్రేయను తొలుత 2019 సెప్టెంబరు 19న హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. అనంతరం 2021 జూలై 7న హరియాణాకు బదిలీ అయ్యారు. గవర్నర్‌గా ఆయన ఐదేళ్ల పదవీకాలం గత ఏడాది సెప్టెంబరు 10నే ముగిసినప్పటికీ 9 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు.ఎన్‌డీఏలో టీడీపీ మళ్లీ చేరి 15 నెలలైన తర్వాత తెలుగుదేశం నేతకు గవర్నర్‌ పదవి ఇవ్వడం గమనార్హం.ప్రస్తుతం గోవా గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై ఉన్నారు.కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడైన ఈయన 2019లో మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021లో గోవాకు బదిలీ అయ్యారు.ఇప్పుడీయన స్థానంలో అశోక్‌ గజపతిరాజు బాధ్యతలు చేపట్టనున్నారు.ఇక లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బ్రిగేడియర్‌ బీడీ మిశ్రా రాజీనామా చేయడంతో ఆ స్థానంలో జమ్మూకశ్మీరు మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కవీందర్‌ గుప్తాకు అవకాశం కల్పించారు.


ఘోస్‌కు ఆర్‌ఎస్ఎస్‌ నేపథ్యం..

అసీం ఘోష్‌ (81)విద్యావేత్త. గొప్ప వక్త. మృదుస్వభావి.ఆర్‌ఎస్ఎస్‌లో పనిచేశారు.1999-2002 నడుమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. సంస్థాగతంగా ఆ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.తర్వాత తెరమరుగయ్యారు.20 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన్ను ఆకస్మికంగా హరియాణా గవర్నర్‌గా నియమించడాన్ని సొంత పార్టీ వాళ్లే నమ్మలేకపోతున్నారు.కవీందర్‌ గుప్తా (65) గతంలో జమ్ము మేయర్‌గానే గాక జమ్మూకశ్మీరు అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. బలమైన ఆర్‌ఎస్ఎస్‌ నేపథ్యం ఉంది.బీజేపీ ఇటీవలి కాలంలో రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నవారు..ఆర్‌ఎస్ఎస్‌ ఆమోదం ఉన్నవారినే నియమించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 15 , 2025 | 03:30 AM