Central Government: 15 ఏళ్లు దాటిన వాహనాలకు భారీగా షాక్
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:29 AM
వాహనం ఫిట్‌గానే ఉంది, 15 ఏళ్లు దాటిగా ధీమాగా రోడ్లపై తిప్పుతాను అంటే ఇకపై భారీగా ఫీజులు చెల్లించాల్సిందే.
మోతమోగేలా ఫిట్‌నెస్ చార్జీలు
కేంద్రం నిర్ణయంతో యజమానులు బేజారు.. పునరాలోచించాలని వినతి
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వాహనం ఫిట్‌గానే ఉంది, 15 ఏళ్లు దాటిగా ధీమాగా రోడ్లపై తిప్పుతాను అంటే ఇకపై భారీగా ఫీజులు చెల్లించాల్సిందే. కేంద్రం తాజా నిర్ణయంతో వయసు మళ్లిన వాహనాలను రోడ్లపై తిప్పాలంటే మోయలేని భారమే కానుంది. నాలుగు చక్రాల వాహనాలు (క్యాబ్‌లు) 15 ఏళ్ల వరకూ ఫిట్నెస్ ఫీజు రూ. 944 మాత్రమే. పదిహేను ఏళ్లు దాటితే ఏడాదికి రూ.5,310 చెల్లించాల్సిందే. 20 ఏళ్లు దాటిన వాటికి ఏటా రూ.10,620 సమర్పించుకోక తప్పదు. ఇదే నాలుగు చక్రాల కోటాలోని ఎల్‌ఎంవీ(కార్లు)లకు పదిహేనేళ్ల వరకూ రూ.944 కాగా ఆ తర్వాత ఏడాదికి రూ.10,030 చెల్లించాలి ఇరవై సంవత్సరాలు దాటితే రూ.20,060 భరించక తప్పదు. ఇక సరుకు రవాణాకు ఉపయోగించే మధ్యస్థ సరుకు వాహనాలకు (ఎంజీవీ) పదేళ్ల వరకూ రూ.1,416, పదమూడేళ్ల వరకూ రూ.2,360, 15 ఏళ్ల వరకూ రూ.7,080 వరకూ చెల్లించాలి. 15 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఏటా రూ.13,384, 20సంవత్సరాలు దాటితే ఏటా రూ.33,040 భారం మోయాల్సిందే. భారీ వాహనాలైన లారీలకు ఇదే వర్తిస్తుందని కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వాహనం కండీషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి భారాలు మోపడం భావ్యం కాదని ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.