Share News

Minister Durgesh: త్వరలో నూతన ఫిల్మ్‌ పాలసీ

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:09 AM

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం త్వరలో నూతన ఫిల్మ్‌ పాలసీని తెస్తున్నామని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చెప్పారు. ఈ ఏడాది నంది అవార్డులిస్తామని ప్రకటించారు.

Minister Durgesh: త్వరలో నూతన ఫిల్మ్‌ పాలసీ

  • ఈ ఏడాది నంది అవార్డుల ప్రదానం

  • సినీ నిర్మాతల భేటీలో మంత్రి దుర్గేశ్‌ వెల్లడి

  • పరిశ్రమకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని హామీ

  • అధ్యయనం చేసి సరైన ప్రతిపాదనలతో రావాలని సూచన

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): cసోమవారం అమరావతి సచివాలయంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు ఆయనతో భేటీ అయ్యారు. సినిమా రంగ సమస్యలపై రూపొందించిన డాక్యుమెంట్‌ను మంత్రికి అందజేశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన 24 విభాగాల అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. వారిద్దరి అపాయింట్‌మెంట్లు ఇప్పించాలని కోరుతూ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు భరత్‌భూషణ్‌, గౌరవ కార్యదర్శి దామోదరప్రసాద్‌ మంత్రికి విజ్ఞాపన అందజేశారు. రాష్ట్రంలో సినిమా షూటింగులు, కొత్త సినిమాల విడుదల, నూతన ఫిల్మ్‌ పాలసీ తదితర అంశాలపై నిర్మాతలతో మంత్రి చర్చించారు. సెప్టెంబరు మొదటి పక్షంలో సీఎం, డిప్యూటీ సీఎంతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, సరైన ప్రతిపాదనలతో రావాలని నిర్మాతలకు సూచించారు. అనంతరం మంత్రి దుర్గేశ్‌ మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్‌, రీరికార్డింగ్‌ థియేటర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తామని చెప్పారు. త్వరలో సినీ రంగ భాగస్వాములతో భేటీ అయ్యి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నిర్మాతలు ముందుకు రావడం తొలి మెట్టుగా భావిస్తున్నామని, సినీ రంగానికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని వివరించారు.


నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టమైన సూచనలు చేశారని, ఈ ఏడాది తప్పకుండా నంది అవార్డులిస్తామని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు ఉపయోగపడుతుందో ఆలోచన చేసి, తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాలకు తెలుగు సినిమా ఒక్కటేనని చెప్పారు. ‘అక్కడ ఉత్తమ చిత్రం.. ఇక్కడా ఉత్తమ చిత్రమే అవుతుంది కదా!’ అన్నారు. నంది అవార్డుల ఎంపిక ఇరు రాష్ట్రాలు కలిసి చేయాలా? విడివిడిగా చేయాలా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయని, సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి స్పష్టత వచ్చేలా చూస్తామన్నారు. సినిమాల రూపకల్పన, విధి విధానాల విషయంలో బడ్జెట్‌ ప్రాతిపదికన ఏయే సినిమాలకు ఏ రకంగా సాయం అందించాలన్న అంశంపై నిర్మాతలతో చర్చించినట్లు చెప్పారు. ఏపీలో సినిమారంగంలో పని చేయగల యువతకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని నిర్మాతలను కోరినట్లు మంత్రి వివరించారు. కాగా, హైదరాబాద్‌లో సినీ కార్మికుల సమ్మె అంశానికి, మంత్రితో భేటీకి ఎలాంటి సంబంధమూ లేదని సినీ నిర్మాతలు కేఎల్‌ నారాయణ, టీజీ విశ్వప్రసాద్‌ మీడియాకు తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 06:09 AM