Share News

Administrative Challenges: కొత్త జిల్లాలు.. పాత కష్టాలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:54 AM

నాడు జగన్‌ ప్రభుత్వం భౌగోళిక పరిస్థితులు, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా జిల్లాలను విభజించింది.

Administrative Challenges: కొత్త జిల్లాలు.. పాత కష్టాలు

  • నాడు విభజించి.. వదిలేసిన జగన్‌ సర్కారు

  • 13 కొత్త జిల్లాల కేంద్రాల్లో పరిస్థితి దారుణం

  • ఓ ప్రణాళిక లేకుండా హడావుడిగా ఏర్పాటు

  • నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం

  • తాత్కాలిక భవనాల్లోనే కార్యాలయాలు

  • ఫంక్షన్‌ హాళ్లు, చాలీచాలని అద్దె భవనాల్లో

  • కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాటు

  • చాలా చోట్ల కనీస వసతులూ కరువు

  • ఇరుకు గదుల్లోనే సిబ్బంది విధులు

  • పలు కార్యాలయాల్లో సిబ్బంది కొరత

  • అనేక శాఖలు ఇన్‌చార్జుల పాలనలోనే

  • సమస్యలు పరిష్కరించని జగన్‌ సర్కారు

  • కూటమి దృష్టిసారించాలని వినతులు

13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను 2022లో అప్పటి జగన్‌ ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించింది. నేటి చంద్రబాబు ప్రభుత్వం మరో 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త జిల్లాల సంగతి సరే... జగన్‌ ఏర్పాటు చేసిన 13 ‘పాత’ జిల్లాల పరిస్థితి ఏంటి? బాలారిష్టాలు దాటాయా? కార్యాలయాలు ఏర్పడ్డాయా? సిబ్బంది సమకూరారా? దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం...

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

నాడు జగన్‌ ప్రభుత్వం భౌగోళిక పరిస్థితులు, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా జిల్లాలను విభజించింది. జిల్లా కార్యాలయాల కోసం శాశ్వత భవనాలను సమకూర్చలేదు. వాటి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. కనీసం స్థలాలను కూడా సేకరించలేదు. హడావుడిగా 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి వదిలేసింది. దాదాపు అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీ వంటి అతి ముఖ్యమైన అధికారులకు మినహా ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలకు తగిన వసతులతో భవనాలు లేవు. చాలా వరకు అద్దె భవనాల్లో పరాయి పంచన నడుస్తున్నాయి. దాదాపుగా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు కూడా సొంత శాశ్వత భవనాలు లేవు. డివిజన్‌, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, చాలీచాలని అద్దె భవనాలు, కాలేజీలు, ఫంక్షన్‌ హాళ్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేశారు.


కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు దూరంగా పెట్టారు. ఉద్యోగులు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదు. తాగునీరు కూడా లభించని పరిస్థితి. చాలా కార్యాలయాలు ఇరుకు గదుల్లో నడుస్తున్నాయి. కనీస మౌలిక వసతులు లేవు. పలు చోట్ల ఉద్యోగులు కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా ఇవ్వలేదు. మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఉద్యోగులు, అందులోనూ మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఆఫీసుల్లో సిబ్బంది కొరత ఉంది. పలు జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఇన్‌చార్జిల పాలనలో నడుస్తున్నాయి. ఏ జిల్లా చూసినా గందరగోళ పరిస్థితి. జిల్లా ‘పాలన’ అస్తవ్యస్తం. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత రెండేళ్లపాటు వైసీపీ అధికారంలో ఉంది. అయినా సమస్యలను పరిష్కరించలేదు. ఫలితంగా ఇప్పటికీ కొత్త జిల్లాల కేంద్రాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కొన్ని విభాగాలు కొనసాగుతున్నాయి. స్టేషనరీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సిన దుస్థితిని ఆయా శాఖలు ఎదుర్కొంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానికుల కోరిక మేరకు కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. అలాగే కార్యాలయాలకు శాశ్వత భవనాల ఏర్పాటు, అధికారుల నియామకం తదితర సమస్యలపై దృష్టిసారించి ‘పాలన’ను చక్కదిద్దాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు. 2022లో అప్పటి జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 కొత్త జిల్లాల కేంద్రాల్లో దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..


బాపట్ల ..

బాపట్ల కేంద్రంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా జిల్లా కేంద్రంలో మౌలిక వసతుల కల్పన ఊసే లేదు. సమీకృత కలెక్టరేట్‌ పేరిట గత ప్రభుత్వం చేసిన హడావిడి ప్రకటనలకే పరిమితమైంది. ఓ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందిన కళాశాల భవనంలో పలు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. నెలల తరబడి అద్దె కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది. మరికొన్ని శాఖల కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కీలక శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కయ్యారు. డీఆర్‌డీఏ, పర్యాటక, అటవీ ఇలా దాదాపు పది విభాగాలకు అదనపు బాధ్యతలతోనే నెట్టుకురావడంతో పాలనలో వేగం కనబడటం లేదు.

Untitled-1 copy.jpg


నంద్యాల ..

నంద్యాల జిల్లాలో కలెక్టర్‌, వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ కార్యాలయాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యాన శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖల సంక్షేమ, విద్యా శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల భవనాల్లో ఎస్‌ఎస్ఏ, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీఓ కార్యాలయాలు ఉన్నాయి. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయం తాత్కాలిక రేకులషెడ్డులో ఉంది. వైద్యఆరోగ్య శాఖ, డీసీహెచ్‌ఎస్ కార్యాలయాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని గదుల్లో ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు.

Untitled-1 copy.jpg


శ్రీసత్యసాయి ..

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నేటికీ పరాయి పంచన, మౌలిక వసతులు లేని ఇరుకు గదుల్లోనే పాలన సాగించాల్సిన దుస్థితి. కలెక్టరేట్‌తో పాటు 90శాతం ప్రభుత్వ కార్యాలయాలకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు భవనాలను సమకూర్చింది. కొన్ని కార్యాలయాలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారులు కూర్చునేందుకు కుర్చీలు లేవు. బుక్కపట్నంలో పాత డైట్‌ కళాశాలలో సమగ్ర శిక్ష కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది. కొత్తచెరువులో ఎంఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి, బాలుర బీసీ హాస్టల్లో కార్మిక, ఐసీడీఎస్‌ కార్యాలయం ఉన్నాయి. దీనజనోద్ధరణ భవన సముదాయంలో 15కార్యాలయాల్లో వంద మందికిపైగా అధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ గుక్కెడు నీరు కావాలన్నా పుట్టపర్తికి వెళ్లాల్సిందే. రాత్రి 8.30 దాటిందంటే బస్సు సర్వీసులు కూడా ఉండవు.

Untitled-1 copy.jpg


అన్నమయ్య ..

రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాలో ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవు. పదికి పైగా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం మిన హా మిగిలిన జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతులు లేవు. జిల్లా డ్వామా కార్యాలయం దిగువఅబ్బవరం సచివాలయంలో, డీపీవో కార్యాలయం చెన్నముక్కపల్లె సచివాలయంలో, డీఈవో కార్యాలయం, సర్వశిక్షా అభియాన్‌ పీవో కార్యాలయం ఒకప్పటి కొత్తపేట ఎంపీయూపీ స్కూల్‌లో ఉన్నాయి. రాయచోటి పట్టణానికి దూరంగా ఉన్న మైనార్టీ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో బీసీ వెల్ఫేర్‌, ఎస్సీ వెల్ఫేర్‌, సహకార బ్యాంకుల కార్యాలయాలు, వ్యవసాయం, ఉద్యాన, మత్స్సశాఖ, సూక్ష్మసేద్యం, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌, ఏపీ ఫైబర్‌నెట్‌, భూగర్భ జలశాఖ, స్పోర్ట్స్‌, మార్కెటింగ్‌ సమాఖ్య జిల్లా మేనేజర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూ ఉన్న పల్లెలకు వెళ్లే విద్యుత్‌ లైను నుంచే వీటికి కనెక్షన్‌ తీసుకోవడంతో.. ఈ కార్యాలయాలకు ఒక్కోసారి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు రాదు. కార్యాలయాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో తరచూ విషసర్పాలు వస్తున్నాయి.

Untitled-1 copy.jpg


పశ్చిమగోదావరి ..

భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. పట్టణానికి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదు. దాతలు, మున్సిపాలిటీ సహకారంతో వసతులు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. కిక్కిరిసిన గదుల్లోనే జిల్లా సర్వే, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. రికార్డులు భద్రపరిచే సౌకర్యాలు లేవు. సర్వే శాఖలో రికార్డులు ఒక టేబుల్‌పై దుప్పటి కప్పి ఉంచుతున్నారు. కలెక్టరేట్‌ భవన నిర్మాణం కోసం వైసీపీ హయాంలో స్థలం కేటాయించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయకుండా వదిలేశారు.

Untitled-1 copy.jpg


బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ ..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పేరుకే జిల్లా కేంద్రం అన్నట్టుగా పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం ఒకచోట, అనుబంధ కార్యాలయాలు మరోచోట ఉండడంతో అటు అధికారులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అమలాపురంలో గతంలో డీఆర్డీఏ అధీనంలో ఉన్న భవనాల్లో కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. నల్లవంతెన సమీపంలో అద్దె భవనంలో ఎస్పీ కార్యాలయం ఉంది. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మిడివరంలోని ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో 32 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పలు కార్యాలయాలు ముమ్మిడివరంలో ఉండడంతో అధికారులు అందుబాటులో ఉండకుండా కాన్ఫరెన్సులు, క్యాంపుల పేరుతో దూరంగా ఉంటున్నారని ప్రజలు అంటున్నారు.

Untitled-1 copy.jpg


తూర్పుగోదావరి ..

రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి పేరుకే జిల్లాగా ఉన్నట్టుంది. కలెక్టరేట్‌కు ఒక కొత్త భవనం కూడా లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వివిధ వృత్తుల్లో నైపుణ్యం పెంచడం కోసం బొమ్మూరులో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరిట నిర్మించిన భవనంలో కలెక్టరేట్‌ ఏర్పాటు చేశారు. నేక్‌ను మాత్రం గతంలో హాస్టల్‌గా వాడుకునే భవనానికి తరిమేశారు. గిరిజన యువత శిక్షణ కోసం అదే ప్రాంతంలో నిర్మించిన వైటీసీ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి కొన్ని ప్రభుత్వ శాఖలకు అప్పగించారు. వీటిలో బీరువా కూడా పట్టని పరిస్థితి. గతంలో ఇక్కడి సబ్‌-కలెక్టర్‌ నివాస భవానాన్ని కలెక్టర్‌ నివాస భవనంగా వాడుతున్నారు. జేసీ కూడా అద్దె ఇంట్లోనే ఉండే పరిస్థితి.

Untitled-1 copy.jpg


తిరుపతి ..

తిరుపతి జిల్లాలో కలెక్టరేట్‌ టీటీడీకి చెందిన భవనంలో అద్దె ప్రాతిపదికన నడుస్తోంది. తిరుచానూరులోని పద్మావతి నిలయం భవనాన్ని నెలకు రూ.28 లక్షల అద్దెతో కలెక్టరేట్‌ కోసం తాత్కాలికంగా కేటాయించింది. 80శాతం శాఖల కార్యాలయాలకు టీటీడీ భవనంలోనే గదులు కేటాయించారు. మిగిలిన 20 శాతం శాఖల్లో కొన్ని డివిజన్‌ కార్యాలయాల్లో తాత్కాలికంగా నడుస్తుండగా, మరికొన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పోలీసు, డ్వామా, డీఆర్‌డీఏ, ట్రెజరీ వంటి నాలుగైదు శాఖలకే సొంత భవనాలున్నాయి. జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవోలకు సొంత నివాస బంగ్లాలు లేవు. జిల్లా ఏర్పాటు కంటే ముందే తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా కావడం వల్ల జిల్లా పోలీసు కార్యాలయం మాత్రమే అది కూడా ఇటీవలే నిర్మాణమైంది. శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్లలో సొంత భవనాలు దేనికీ లేవు.

Untitled-1 copy.jpg


ఎన్టీఆర్‌ ..

విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటివరకు పలు శాఖలకు సొంత భవనాలు లేవు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ఏర్పాటు చేయలేదు. అప్పట్లో గొల్లపూడిలోని రాష్ట్ర దేవదాయ శాఖ కార్యాలయం చెంతన ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయానికి స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వదిలేశారు. విజయవాడలో గతంలో సబ్‌ కలెక్టరేట్‌, విజయవాడ రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం ఉన్న భవనాన్ని తాత్కాలికంగా కలెక్టరేట్‌గా చేసుకున్నారు. ఇక్కడి కలెక్టరేట్‌లో రెండు మూడు శాఖలు తప్ప మిగిలిన వాటికి చోటు లేదు. విజయవాడ రెవెన్యూ డివిజనల్‌/సబ్‌ కలెక్టరేట్‌ను మాంటిస్సోరి కళాశాలలో అద్దె భవనంలో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పలు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.

కృష్ణా ..

వ్యవసాయ ఆధారిత కృష్ణా జిల్లా(మచిలీపట్నం కేంద్రం)లో కీలకమైన నీటిపారుదల శాఖ ఎస్‌ఈ పోస్టును ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోనే ఉంచారు. విజయవాడ నుంచే ఈ శాఖకు సంబంధించిన పరిపాలన కొనసాగుతోంది. కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలకు ఈ ఎస్‌ఈ ద్వారానే పరిపాలనను నెట్టుకొస్తున్నారు. పలు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కలెక్టర్‌, జేసీ కార్యాలయాలతో పాటు బంగ్లాలను కొంతమేర ఆధునికీకరించి సరిపెట్టారు.


అల్లూరి జిల్లా...

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. రూ.100 కోట్లతో కలెక్టరేట్‌, ఎస్‌పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వం భావించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కలెక్టరేట్‌తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో, ఎస్‌పీ కార్యాలయాన్ని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో నిర్వహిస్తున్నారు. మరికొన్ని కార్యాలయాలను ఐటీడీఏ కార్యాలయంలోని పలు గదుల్లో కొనసాగిస్తున్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్‌పీ వంటి పోస్టింగ్‌లు మినహా అనేక శాఖలు ఇన్‌చార్జులతోనే నడుస్తున్నాయి.

Untitled-1 copy.jpg


అనకాపల్లి ..

అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లిలో అత్యధిక శాతం ప్రభుత్వ కార్యాలయాలు అరకొర వసతుల నడుమ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయంతో పాటు ఎస్‌పీ కార్యాలయం కూడా పరాయి పంచన నడుస్తున్నాయి. కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరం పంచాయతీ పరిధిలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇది లూప్‌లైన్‌ కావడంతో సొంత వాహనాలు లేనివారు అనకాపల్లి నుంచి ప్రత్యేకంగా ఆటోలను మాట్లాడుకుని వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు 45 వరకు ఉండగా, వాటిల్లో 30 శాఖల కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. డీపీవో కార్యాలయాన్ని శంకరం పంచాయతీలోని సామాజిక భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి చదరపు అడుగుకు నెలకు రూ.10 చొప్పున అద్దె చెల్లిస్తుంది. కానీ పట్టణంలో ఇంత తక్కువ అద్దెకు భవనాలు లభించకపోవడంతో పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సమీపంలోని గ్రామాల్లో ఏర్పాటు చేశారు.


పార్వతీపురం మన్యం ..

పార్వతీపురం కేంద్రంగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఐటీడీఏ కార్యాలయ నిర్వహణ కోసం కొత్తగా నిర్మించిన కార్యాలయంలో కలెక్టరేట్‌ నిర్వహిస్తున్నారు. మూతపడిన ఆర్‌సీఎం పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఐదు శాఖలకు మినహా మిగిలిన శాఖలకు సొంత భవనాలు లేని పరిస్థితి. ఒకే ప్రాంగణంలో 25 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. దీంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Untitled-1 copy.jpg

Updated Date - Dec 08 , 2025 | 06:07 AM