Navya Andhra Pradesh: నవ్యాంధ్రలో నవోదయం
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:45 AM
గత వైసీపీ ప్రభుత్వంనాటి విధ్వంసం నుంచి వికాసం దిశగా.. నాటి చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా.. నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ.. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
2025లో అన్నీ మంచి శకునములే.. జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం
ఊపందుకున్న అమరావతి పనులు
వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
పోటెత్తిన పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు
విశాఖ సదస్సులో 13 లక్షల కోట్ల ఎంవోయూలు
1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు
గ్రీన్ ఎనర్జీ హబ్, డ్రోన్ క్యాపిటల్‌గా రాయలసీమ
పంచాయతీరాజ్‌లో సంస్కరణలు.. రోడ్లకు మహర్దశ
విద్యావ్యవస్థలో పెనుమార్పులు, మెగా డీఎస్సీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంనాటి విధ్వంసం నుంచి వికాసం దిశగా.. నాటి చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా.. నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ.. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ పూర్వవైభవం, బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే దిశగా 2025 ఏడాదిలో అనేక విజయాలు సాధించింది. ఎన్నో ఆశలతో 2026లోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా గత వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల జరిగిన నష్టం ఎన్నో రెట్లు అధికమని సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ విధ్వంస పాలన నుంచి తేరుకోవడానికి, నాటి కష్టనష్టాలను అధిగమించేందుకు ఎక్కువ సమయమే పట్టింది. నాడు అడ్డగోలుగా చేసిన అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయి. ఆర్థిక కష్టాలు ఉన్నా ఎన్నికల హామీల్లో భాగంగా సంక్షేమం, అభివృద్ధి అమలు చేయాల్సిన పరిస్థితి. 2025లో కష్టాల నుంచి కాస్త తేరుకుని ఈ ఏడాదిని దిగ్విజయంగా పూర్తి చేసింది. 2025లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక ఘట్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...
ఐదుసార్లు ప్రధాని రాక
ప్రధాని మోదీ 2025 జనవరిలో విశాఖ సందర్శించారు. రూ.2 లక్షల కోట్లకుపైగా మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఈ గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీకి పునాది వేశారు. ఎన్టీపీసీ నేతృత్వంలో పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాప చేశారు. మేలో అమరావతి వచ్చి రూ.58 వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. జూన్‌లో విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అక్టోబరులో కర్నూలులో జీఎస్టీ సదస్సుకు హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నవంబరులో పుట్టపర్తి సందర్శించి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
రాజధాని, పోలవరం రైట్ రైట్
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను గాడిలో పెట్టడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. గత వైసీపీ ప్రభుత్వం వేసిన చిక్కుముడులను విప్పేందుకు 2024 అర్ధభాగం గడిచిపోగా, 2025లో మరికొంత సమయం పట్టింది. వీటన్నింటినీ అధిగమించి మళ్లీ పట్టాలెక్కించింది. ప్రస్తుతం రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా 2025 మేలో సుమారు రూ.58 వేల కోట్లతో అమరావతి పనులను ప్రభుత్వం పునఃప్రారంభింప చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలను అమరావతికి తీసుకురావడంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా నవంబరులో బ్యాంకుల సముదాయానికి శంకుస్థాపన చేయించింది. మరోవైపు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అమరావతి తొలి దశను మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా అవాంతరాలు లేకుండా సాగిపోతున్నాయి. తొలి దశను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. పోలవరం పరిసర ప్రాంతాల్లో 9,900 ఎకరాల్లో లైడార్ సర్వే చేసి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు.
పెట్టుబడుల వెల్లువ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్‌రాజా, లులూ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకూ సమాయత్తమైంది. కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రూ.12 వేల కోట్ల నిధులను సాధించింది. వైసీపీ హయాంలో కోల్పోయిన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించే దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ 2025 తొలినాళ్లలో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు హాజరయ్యారు. పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోకి ఆహ్వానించారు. 2025 నవంబరులో విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై నమ్మకాన్ని పెంచారు. ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 7.5 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. ఈ సదస్సులోనే ప్రభుత్వం వినూత్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించేందుకు ఎస్ర్కో ఖాతాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలమంటూ ప్రాజెక్టుల ఏర్పాటుకు శరవేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రత్యేకత అని ప్రకటించింది.
విశాఖకు ఐటీ.. సీమకు గ్రీన్ ఎనర్జీ
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు ఐటీ పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ ఇప్పటికే ప్రారంభం కాగా, కాగ్నిజెంట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. 2025లో విశాఖకు అతిపెద్ద ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. సుమారు 15 బిలియన్ డాలర్లు (రూ.1,34,707 కోట్లు) పెట్టుబడితో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. అన్ని అనుమతులను పూర్తి చేసుకుని 2026లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మరో మెగా ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. అదే.. 1.41 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా, డ్రోన్ క్యాపిటల్‌గా రూపొందించేందుకు సిద్ధమవుతోంది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ 7 వేల మెగావాట్ల సోలార్, విండ్, హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకుంది. రూ.49 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కోస్తా ప్రాంతాన్ని ఆక్వా హబ్‌గా, క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు.
అభివృద్ధి, సంక్షేమంలోనూ సై..
అభివృద్ధి, సంక్షేమంలోనూ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసింది. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీతో 15,941 టీచర్ పోస్టుల భర్తీ, 6,200 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసింది.
రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణం
175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం-సన్నాహాలు
పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు
రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ. దాదాపు 3 వేల పనులకు శ్రీకారం.
అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్‌వర్క్
పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
హంద్రీనీవా కాలువల వెడల్పు, రాయలసీమకు సాగునీరు
గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీకి శ్రీకారం
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా టీచర్ల బదిలీలు
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధికి శ్రీకారం
పూర్వోదయ పథకంలో రాష్ర్టానికి చోటు, విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభం .
లక్ష కోట్ల నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం
తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10090 కోట్లు జమ
స్త్రీశక్తి పేరుతో మహిళలకు 3.25 కోట్ల ఉచిత ప్రయాణాలు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.6310 కోట్లు జమ.
దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లకు రూ.2648 కోట్లు ఖర్చు.
సామాజిక భద్రత పెన్షన్లకు రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు పంపిణీ.
మత్స్యకార భరోసా కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు పంపిణీ.
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా రూ.15 వేల చొప్పున 2.90 లక్షల మందికి రూ.436 కోట్లు జమ.
8427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవవేతనం రూ.51 కోట్లు,
ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు అందజేత
పురోహితులకు నెలకు రూ.15 వేలు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనాలు పెంపు.
జూనియర్ లాయర్లకు రూ.10 వేల గౌరవవేతనం. మహిళలకు కుట్టుమిషన్లు.
నేతన్నలకు ఉచిత విద్యుత్ కింద మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు.
శిక్షణ పొందే కానిస్టేబుల్స్‌కు స్టయిఫండ్ రూ.4500 నుంచి రూ.12500కు పెంపు.
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు ఈ ఏడాది నుంచే గ్రాట్యుటీ
పారిశ్రామిక రంగం అభివృద్ధికి 23 కొత్త పాలసీలు.
100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులతో రికార్డు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో 34.23 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
కేంద్రంతో సమన్వయం.. 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ