Share News

AP New Constituencies: 2034 ఎన్నికల్లోనే

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:23 AM

2014లో అమలులోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో... సీమాంధ్రలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.

AP New Constituencies: 2034 ఎన్నికల్లోనే

  • కొత్త నియోజకవర్గాల కోసం ఆగాల్సిందే

  • విభజన చట్టం ఇచ్చిన వెసులుబాటు వృథా

  • ఇప్పుడున్నది 2011 జనాభా లెక్కలే

  • కొత్త లెక్కల ప్రకారమే డీలిమిటేషన్‌

  • తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

  • 2027లో మొదలుకానున్న జనగణన

  • అది ముగిశాకే డీలిమిటేషన్‌ ప్రక్రియ

  • 2029 ఎన్నికల్లోపు పునర్వ్యవస్థీకరణ అసాధ్యం

  • ఆ తర్వాతి ఎన్నికల్లోనే 225 అసెంబ్లీ సీట్లు

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై పార్టీలు, ఔత్సాహిక రాజకీయ నాయకులు పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు! రాష్ట్ర విభజన చట్టంలో వెసులుబాటు ఇచ్చినా... రాజ్యాంగం ఒప్పుకోదంటూ సుప్రీంకోర్టు తేల్చేసింది. జనాభా లెక్కలు తేలిన తర్వాతే... నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరుపుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వెరసి... 2034 ఎన్నికలకు గానీ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

2014లో అమలులోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో... సీమాంధ్రలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అని పిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న నేతలు అప్పటి నుంచే కొత్త నియోజకవర్గాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ... కేంద్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఈ దిశగా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ ఊసే మరిచిపోయారు.


విభజన చట్టంలో చెప్పినా...

సీమాంధ్రలో అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు పెంచుకోవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే... దానికి ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. 2011 నాటి లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయలేని పరిస్థితి. కాబట్టి... తదుపరి జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చని భావించారు. 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్నా... కొవిడ్‌ కారణంగా అది జరగలేదు. 2026 తర్వాత జరిగే జన గణన ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్‌ జరగాలని ప్రజాప్రాతినిధ్య చట్టంతోపాటు రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. తాజాగా... 2026 అక్టోబరు నుంచి జన గణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని ప్రకారం తొలి దశలో జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ జరగనుంది. రెండో విడత... 2027 మార్చి ఒకటి నుంచి దేశమంతా చేపడతారు. ఈలెక్కన 2029 ఎన్నికల్లోనే నియోజకవర్గాల సంఖ్య పెంచేయవచ్చు కదా అనే సందేహం రావొచ్చు.

కానీ... అది జరగదు! జనాభా లెక్కలు సేకరించి, వాటిని క్రోడీకరించి, పూర్తిస్థాయిలో గణాంకాలు ఖరారు చేసేందుకు కనీసం మూడేళ్లు పడుతుంది. ఈసారి డిజిటల్‌ ఫార్మాట్‌లో, మొబైల్‌ అప్లికేషన్‌ల ద్వారా జనగణన చేస్తున్నందున... కొంత తక్కువగా రెండేళ్లలోనే లెక్కలు తేలవచ్చు. అంటే... 2029 లేదా 2030లో కొత్త జనాభా గణన వివరాలు ప్రచురితమైన తర్వాత వాటి ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే... జనగణన తేలగానే నియోజకవర్గాలను పెంచేయడం కుదరదు. దానికి ఒక కమిషన్‌ను నియమించాలి. ఆ కమిషన్‌ సమగ్రంగా అధ్యయనం చేయాలి. కొత్త నియోజక వర్గాలతో ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి. దాని ఆధారంగా ఫైనల్‌ నోటిషికేషన్‌ ఇవ్వాలి. అప్పటికిగానీ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావు. ఇందుకు కనీసం ఏడాది సమయం పడుతుంది. అయితే... 2029 తొలి ఆరునెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరపక తప్పదు. వెరసి... వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ప్రకటించే అవకాశమే లేదు. అంటే... 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ఎన్నికల కమిషన్‌ వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.


ససేమిరా అన్న సుప్రీం...

నిజానికి 2021లో జన గణన మొదలై సకాలంలో పూర్తయి ఉంటే 2029 ఎన్నికలకు ముందే డీలిమిటేషన్‌ జరిగేది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్‌ జరగాలని తాజాగా సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఆంధ్రా, తెలంగాణల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ప్రొఫెసర్‌ పురుషోత్తం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. వెరసి... కొత్త నియోజకవర్గాలపై రాష్ట్ర విభజన చట్టంలో వెసులుబాటు కల్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్న మాట! 2014లో అమలులోకి వచ్చిన చట్టంలో పేర్కొన్న హామీ అమలులోకి రావడానికి 20 ఏళ్లు పడుతుండటమే ఒక విచిత్రం! అప్పుడు... మనతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించే అవకాశముంది. అధిక జనాభా కారణంగా ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో నియోజకవర్గాల సంఖ్య తక్కువ స్థాయిలోనే పెరిగే అవకాశముందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే... సీమాంధ్రలో మాత్రం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలను కనీసం 225 స్థానాలు చేయాల్సిందే!



ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Updated Date - Jul 27 , 2025 | 03:28 AM