నయా ‘వాణిజ్య’ దందా!
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:12 AM
చూడడానికి అధికారుల వలే కనిపిస్తారు. తనిఖీలకు వెళ్లినప్పుడు అధికారులు చేసే హడావిడి చేస్తారు. బిల్లులు చూపించమని గద్దిస్తారు. ఆ తర్వాత ఆయా వ్యాపారుల నుంచి అందినకాడికి దండుకుంటారు. ఇదీ వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల నయా దందా!. అధికారులు చేయాల్సిన సీవీటీ(వెహికల్ చెకింగ్ ట్యాక్స్)ను డ్రైవర్లే నిర్వహిస్తుండడం వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. అధికారులు ఇచ్చిన అలుసుతో డ్రైవర్లు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. వ్యాపారులను జలగల్లా పట్టుకుని పీడిస్తున్నారు. తనిఖీల పేరుతో డ్రైవర్లు చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
వాణిజ్య పన్నుల శాఖలో నకిలీ ‘సీవీటీ’లు
అధికారుల అవతారం ఎత్తుతున్న డ్రైవర్లు
ఒక్కో వ్యాపారి నుంచి వేలాది రూపాయల వసూలు
ఉన్నతాధికారులకు చేరిన ఇద్దరు, ముగ్గురు డ్రైవర్ల వ్యవహారం
డ్రైవర్లతో అధికారులు కుమ్మక్కు!
చూడడానికి అధికారుల వలే కనిపిస్తారు. తనిఖీలకు వెళ్లినప్పుడు అధికారులు చేసే హడావిడి చేస్తారు. బిల్లులు చూపించమని గద్దిస్తారు. ఆ తర్వాత ఆయా వ్యాపారుల నుంచి అందినకాడికి దండుకుంటారు. ఇదీ వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల నయా దందా!. అధికారులు చేయాల్సిన సీవీటీ(వెహికల్ చెకింగ్ ట్యాక్స్)ను డ్రైవర్లే నిర్వహిస్తుండడం వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. అధికారులు ఇచ్చిన అలుసుతో డ్రైవర్లు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. వ్యాపారులను జలగల్లా పట్టుకుని పీడిస్తున్నారు. తనిఖీల పేరుతో డ్రైవర్లు చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
ప్రతి ప్రభుత్వ శాఖకు అధికారిక వాహనాలు ఉంటాయి. వాటి సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. కొత్త వాహనాల కొనుగోలుకు బడ్జెట్ కేటాయింపులు ఉండడం లేదు. దీంతో ప్రైవేటు కారులను ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకుంటున్నాయి. ఈ విధంగానే వాణిజ్య పన్నుల శాఖలోకి అధికారుల కోసం అద్దె కారులను తీసుకున్నారు. కారుల యజమానుల వద్ద ఉండే డ్రైవర్లే ఈ వాహనాలను నడుపుతారు. వాణిజ్య పన్నుల శాఖలో సుమారుగా 20-30 ప్రైవేటు కారులు ఉన్నాయి. ఈ వాహనాలకు డ్రైవర్లుగా ప్రైవేటు వ్యక్తులే వ్యవహరిస్తున్నారు. ఒక్కో కారుకు నెలకు రూ.36 వేలను అద్దెగా వాణిజ్య పన్నుల శాఖ చెల్లిస్తోంది. ఈ వాహనాలపై పనిచేసే డ్రైవర్లు సుదీర్ఘకాలంగా ఉండడంతో ఆయా సర్కిళ్లలో ఉన్న లొసుగులను పసిగట్టి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వ్యాపార సంస్థలు, సరుకు రవాణా వాహనాలు జీఎస్టీ చెల్లించాయా లేదా అన్న వివరాలను పరిశీలించడానికి వాణిజ్య పన్నుల శాఖలో ప్రధాన కార్యాలయం నుంచి షెడ్యూల్ ఇస్తారు. దీని ప్రకారమే సర్కిళ్లలోని అధికారులు సీవీటీ(వెహికల్ చెకింగ్ ట్యాక్స్)లకు వెళ్తారు. ఈ తనిఖీలకు వెళ్లినప్పుడు సహాయకులుగా అటెండర్లు, కారు డ్రైవర్లను తీసుకెళ్తున్నారు. అధికారులు సీవీటీల్లో ఏయే వివరాలు వ్యాపారులను, సరుకు రవాణా వాహనదారులను అడుగుతారో వారు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి డ్రైవర్లు రాత్రి సమయాల్లో అధికారుల అవతారం ఎత్తుతున్నారు. సాధారణంగా సీవీటీలకు సంబంధించి ఒక సర్కిల్ పరిధిలోని అధికారులను మరో సర్కిల్‌లోకి పంపుతారు. దీన్ని గమనించిన డ్రైవర్లు తమకు నచ్చిన సర్కిళ్లలోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కార్యాలయం పనివేళలు ముగిసిన తర్వాత అధికారులను వారి ఇళ్ల వద్ద వదిలిపెట్టి వాహనాలను అక్కడే విడిచిపెట్టాలి. డ్రైవర్లు ఆ విధంగా చేయడం లేదు. అధికారులను ఇళ్ల వద్ద దింపేసిన తర్వాత కారులను తీసుకుని వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ కారులను తీసుకుని సీవీటీలకు వెళ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు డ్రైవర్లు ఈవిధంగా చేసినట్టు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. అధికారులు కారుల్లో ఉన్నారని వ్యాపారులను బెదిరించి వేలాది రూపాయలను వసూలు చేసినట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి.
అధికారులే తెరచిన గేటు
సీవీటీలకు వెళ్లినప్పుడు అధికారులు వ్యాపారులను ఏ చిన్న లోపం కనిపించినా బెదిరిస్తున్నారు. వారి నుంచి సరుకు విలువను బట్టి ముడుపులు వసూలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను డ్రైవర్లు, అటెండర్లతో చేయిస్తున్నారు. దీంతో డ్రైవర్లు తామే అధికారులమన్న భావనలోకి వెళ్లిపోతున్నారు. తమ కళ్ల ముందు అధికారులు ప్రదర్శించిన అధికార దర్పాన్ని ఎలాంటి అధికారం లేకపోయినా డ్రైవర్లు చూపిస్తున్నారు. అధికారులు వ్యాపారుల నుంచి ఎంతెంత వసూలు చేశారో ప్రత్యక్షంగా చూసిన డ్రైవర్లు నకిలీ తనిఖీల్లో అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు.