National Employment Guarantee Scheme: ఉపాధి మేలు ఆవిరి!
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:44 AM
పనిని హక్కుగా ప్రకటించి, ఉపాధిని గ్యారంటీ చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మసకబారనుంది. దాని పేరుతోపాటు, రాష్ట్రాలకు ఈ పథకం భారం కాకుండా కేంద్రం ......
జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గరిష్ఠంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఏపీ. గ్రామాల ప్రగతికి ఈ పథకం నిజంగానే ఒక హామీగా నిలిస్తే , పనిని కోరుకునే చేతులకు ఉపాధి ఒక హక్కుగా రాష్ట్రంలో అమలవుతోంది. అందువల్లే ఈ పథకంలో కేంద్రం తలపెట్టిన మార్పులు ఏపీనే అధికంగా ప్రభావితం చేయనున్నాయి. పథకం అమలులోని ‘పరిమితులు’ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టనున్నాయి. ఇప్పటివరకు కేంద్ర పథకం అండతో రూ.వేల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో జరిగాయి. ఇకపై సొంతంగా ఇన్ని పనులు చేపట్టడం ఏపీకి పెను భారం కానుంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ మరింతగా కష్టాల్లో పడనుంది.
ఏపీ గ్రామాల ప్రగతికి కొత్త బిల్లు గండి
ఇప్పటిదాకా ఉపాధి పేదల హక్కు
లేబర్ కాంపోనెంట్‌లో కేంద్రం 100ు నిధులు
మెటీరియల్ కాంపోనెంట్‌లో 75 శాతం కేంద్రం వాటా
ఇకపై కేంద్రం, రాష్ట్రం 60:40 నిధుల వాటా
మిగతా కేంద్ర పథకాల స్థాయికి ఈ స్కీమ్ కుదింపు
పథకంతో గరిష్ఠ లబ్ధి పొందుతున్న ఏపీ
ఏటా 25 కోట్ల పనులు..రూ. పది వేల కోట్ల నిధులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పనిని హక్కుగా ప్రకటించి, ఉపాధిని గ్యారంటీ చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మసకబారనుంది. దాని పేరుతోపాటు, రాష్ట్రాలకు ఈ పథకం భారం కాకుండా కేంద్రం ఇప్పటివరకు అందిస్తున్న సహాయ సహకారాల్లోనూ కోత పడనుంది. ఈ మేరకు కేంద్రం సోమవారం తెచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఉపాధి హామీ పథకం నుంచి గరిష్ఠంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. విభజన కష్టాలు, వైసీపీ పాలన మిగిల్చిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఏపీకి ‘ఉపాధి’ పఽథకంలో కేంద్రం తీసుకురానున్న తాజా మార్పులు శరాఘాతమే కానున్నాయి. లేబర్ కాంపోనెంట్ కింద జరుగుతున్న పనులకు ఇప్పటివరకు కేంద్రం పూర్తి నిధులు సమకూరుస్తోంది. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం 7 5 శాతం నిధులు అందిస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారడంతోపాటు శాశ్వత ఆస్తులు కూడా సమకూరే దారి పడింది. అయితే, తాజా బిల్లును అనుసరించి.. మిగతా కేంద్ర ప్రాయోజిత పథకాల మాదిరిగానే ఉపాధి పథకంలో రాష్ట్ర వాటా ఇకపై 40 శాతం ఉండనుంది. ఉదాహరణకు మన రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు నిధులు కేటాయిస్తే, అందులో రూ.3 వేల కోట్లు మాత్రమే కేంద్రం కేటాయిస్తుంది. మిగిలిన రూ.2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రామికులకు చెల్లింపు గడువును 15 రోజుల నుంచి వారానికి కుదించామని, పని దినాలను 100 నుంచి 125కు పెంచామని కొత్త బిల్లులో చెప్పుకొచ్చారు. అయితే, దీనివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఎందుకంటే, ఇందుకయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉంటుంది. కేంద్రమిచ్చే నిధులతో ఆయా కుటుంబాలకు రాష్ట్రాలు 100 రోజులు అయినా పని కల్పించే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహం నెలకొంది.
ఆర్థికంగా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఏపీ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు 40 శాతం వాటా చెల్లించడమే భారంగా ఉంది. ఈ నేపధ్యంలో ఉపాధి పథకానికి కూడా ఇంతే మొత్తంలో నిధులు సమకూర్చడం మోయలేని బరువే కానుంది. దీంతో ఈ పథకం కింద నిధులు భారీగా అడిగే పరిస్థితి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇకనుంచి శ్రామికుల అవసరం మేర కాకుండా కేంద్రం కేటాయించే నిధులను బట్టే పనుల పరిమాణం నిర్ణయం కానుంది.
మౌలిక వసతులకు రాంరాం.....
కేంద్రం అందించే ఉపాధి నిధులతో గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మారాయి. వలసలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ ఆధారంగా నిధులివ్వడంతో పనులు విరివిగా చేపట్టగలిగారు. మారిన విధానంతో ఇక ఈ పనులను కోటా ఆధారంగా చేపడితే గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మిథ్యేనంటున్నారు. ఏటా 25 కోట్ల పనిదినాలు కల్పించి దేశంలో ముందున్న మనకు, ఈ ఏడాది కేవలం 18 కోట్ల పనిదినాలు కల్పించారు. రాబోయే కాలంలో ఈ పనిదినాలు కూడా అందే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
ఉపాధి ఎలా?...
ఉపాధి పథకాన్ని నమ్ముకుని వేల మంది సిబ్బంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వారికి జీతాలు పెంచకుండా వేధించింది. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు సంస్కరణలు అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇటీవల హామీ ఇచ్చారు. అయితే తాజా మార్పుల వల్ల రాష్ట్రంలో ఈ పథకం ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీకి గోరుచుట్టుపై రోకలిపోటు..
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా వొడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గోరుచుట్టుపై రోకటిపోటులాగా మారింది. ఏటా ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల దాకా కేంద్రం నుంచి నిధులను రాబడుతోంది. అందులో సుమారు రూ.6 వేల కోట్ల దాకా శ్రామికులకు వేతనాల రూపంలోను, మరో రూ.4 వేల కోట్లు మెటీరియల్, అడ్మిన్ వ్యయం కింద అందుతున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా మెటీరియల్ నిధుల కోసం సుమారు రూ.700 కోట్ల నుంచి రూ.1000 కోట్ల దాకా వెచ్చిస్తోంది. అంటే మొత్తంగా ఉపాధి నిధుల్లో కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తోంది. ఇకపై రూ.10 వేల కోట్ల పనులకుగాను కేంద్రం తన వాటా కింద రూ. 6 వేల కోట్లు మాత్రమే ఇస్తుంది. మిగతా రూ.4 వేలకోట్లు రాష్ట్రం సమకూర్చుకోవాలి. ఇది ఏపీకి పెను భారమే కాగలదు.