Healthcare: పుట్టపర్తిలో క్యాన్సర్ ఆస్పత్రి
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:14 AM
సత్యసాయి విద్యాసంస్థల పూర్వవిద్యార్థులు క్యాన్సర్ బాధితుల కోసం ‘శ్రీసత్యసాయి పాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ కేర్ సెంటర్’ను అందుబాటులోకి తెచ్చారు.
సత్యసాయి పూర్వ విద్యార్థుల చొరవతో అందుబాటులోకి
నూతన భవనాన్ని ప్రారంభించిన ఆర్‌జే రత్నాకర్
పుట్టపర్తి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సత్యసాయి విద్యాసంస్థల పూర్వవిద్యార్థులు క్యాన్సర్ బాధితుల కోసం ‘శ్రీసత్యసాయి పాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ కేర్ సెంటర్’ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆస్పత్రి కోసం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు హోమాన్ని నిర్వహించారు. హోమంలో ఆర్‌జే రత్నాకర్ పాల్గొని పూజలు చేశారు. పూర్వ విద్యార్థులు మొదట దీర్ఘకాలంగా క్యాన్సర్‌తో బాధపడే వారికి పాలియేటివ్ సెంటర్ ద్వారా సేవలు అందించారు. అనంతరం ప్రశాంతి నిలయం వెస్ట్ గేటు దగ్గరలో 71 సెంట్ల స్థలాన్ని సేకరించి, అందులో భవనాన్ని నిర్మించారు. నూతన భవనంలో 24 బెడ్లు ఏర్పాటు చేశామని, త్వరలో డయాలసిస్, క్యాన్సర్ సర్జరీ, కీమో థెరపీ సేవలను అందుబాటులో తెస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. వారిని రత్నాకర్ అభినందించారు.