Share News

Braille Learning Assistant: అంధ బాలల కోసం బ్రెయిలీ లెర్నింగ్‌ అసిస్టెంట్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:43 AM

దృష్టి లోపం ఉన్నవారికి బ్రెయిలీ లిపి ఓ వరం. ఈ లిపిని బోధించే అధ్యాపకులు విద్యార్థులకు అన్నివేళలా దగ్గరే ఉండి బోధించడం సాధ్యం కాదు.

Braille Learning Assistant: అంధ బాలల కోసం బ్రెయిలీ లెర్నింగ్‌ అసిస్టెంట్‌

  • సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేసిన గీతం అధ్యాపకుడు

  • విద్యార్థులు స్వయంగా బ్రెయిలీ నేర్చుకునే వెసులుబాటు

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), నవంబరు 25(ఆంధ్రజ్యోతి): దృష్టి లోపం ఉన్నవారికి బ్రెయిలీ లిపి ఓ వరం. ఈ లిపిని బోధించే అధ్యాపకులు విద్యార్థులకు అన్నివేళలా దగ్గరే ఉండి బోధించడం సాధ్యం కాదు. ప్రత్యేక పాఠశాలలు లేని ప్రాంతాల్లో చదువుకోవాలన్న అభిలాష ఉన్న చిన్నారులకు మరీ కష్టం. ఈ సమస్యను పరిష్కరించేందుకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ బ్రెయిలీ లెర్నింగ్‌ అసిస్టెంట్‌ పేరిట సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. కంటి చూపు లేని బాలలు గురువు సహాయం లేకుండా స్వయంగా బ్రెయిలీ నేర్చుకునేలా దీనిని తీర్చిదిద్దారు. ఈ లెర్నింగ్‌ అసిస్టెంట్‌ ఎంబడెడ్‌ కిట్‌ బ్రెయిలీ లిపిని ఇంటి వద్ద ఉంటూ మరింత సులభంగా నేర్చుకునేలా చేస్తుందని చిస్తీ తెలిపారు. దీనికి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. ఈ పరికరంలో 3 బై 2 ఆకారంలో గుల్లగా ఉన్న బ్రెయిలీ సెల్‌ ఉంటుంది. ఇందులోని సెన్సర్లు విద్యార్థి ఉంచిన డాట్స్‌ను కచ్చితంగా గుర్తిస్తాయని, ఆ ప్యాట్రన్‌ను సిస్టమ్‌ డీకోడ్‌ చేసి సంబంధిత అక్షరం, సంఖ్య లేదా సూచనను ఆడియో రూపంలో విద్యార్థులకు వినిపిస్తుందని వివరించారు. తద్వారా వారు బ్రెయిలీని స్వయంగా నేర్చుకోవడం సులభమవుతుందన్నారు. గురువుల మీద ఆధారపడే అవసరాన్ని ఈ పరికరం గణనీయంగా తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని తెలిపారు. ఈ పరికరం తయారీలో టి.సూర్యస్వరూప్‌, మహ్మద్‌ ఎహసాన్‌, మహ్మద్‌ సమీమ్‌ సుల్తానా ఎంతో సహకరించారని డాక్టర్‌ చిస్తీ తెలిపారు.

Updated Date - Nov 26 , 2025 | 06:43 AM