కొత్తగా మరిన్ని బీసీ గురుకులాలు: సవిత
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:44 AM
రాష్ట్రంలో మరిన్ని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
‘వాల్మీకి భవనం’ కోసం రూ.కోటి విరాళం: మంత్రి భరత్
అనంత, కర్నూలులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
కర్నూలు ఎడ్యుకేషన్, అనంతపురం క్రైం, అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరిన్ని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అలాగే బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. మంగళవారం కర్నూలు, అనంతపురం నగరంలో వాల్మీకీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో మంత్రి సవిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ.. వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వాల్మీకులను ఎస్టీలో చేర్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందున వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు కృషి ఫలిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. కాపు భవన్, బీసీ భవన్ల నిర్మాణానికి రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించానని, అదేవిధంగా వాల్మీకి భవనానికి రూ.కోటి విరాళంగా ఇస్తానన్నారు. కాగా.. వాల్మీకులు, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. అనంతపురం వాల్మీకి సర్కిల్‌లో మంగళవారం జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘వాల్మీకి.. మహర్షిగా మారి రచించిన రామాయణం సంస్కృత ఆది కావ్యమే కాదు.. ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువల్ని నేర్పే గొప్ప పాఠం’ అని రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయ ప్రకాశ్ నారాయణ అన్నారు. విజయవాడలో వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.