Excise Department: 1 నుంచి అమల్లోకి కొత్త బార్ పాలసీ
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:26 AM
నూతన బార్ పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు రూపాల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు.
నోటిఫికేషన్ విడుదల
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): నూతన బార్ పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు రూపాల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు.28న ఉదయం లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేస్తామని, సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని వివరించారు. మంగళగిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మతో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. బార్ పాలసీలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీచేశామని, అందులో 10శాతం(84 బార్లను) గీత కులాలకు ప్రభుత్వం కేటాయించిందని వాటికి బుధవారం నోటిఫికేషన్ జారీచేసి, 30న లాటరీ నిర్వహిస్తామని తెలిపారు.గీత కులాల బార్లకు 50శాతం లైసెన్స్ ఫీజు ఉంటుందన్నారు. సాధారణ బార్లకు జనాభా ఆధారంగా రూ.35 లక్షలు, రూ.55 లక్షలు, రూ.75 లక్షలు చొప్పున లైసెన్స్ ఫీజులు నిర్ణయించామని చెప్పారు. గత బార్ పాలసీలో వేలం విధానం వల్ల చాలా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.కోటి దాటిందన్నారు. ఈసారి ఒకే లైసెన్స్ ఫీజు ఉండేలా లాటరీ విధానం తెచ్చామని చెప్పారు.దరఖాస్తు రుసుం గతంలో మూడు కేటగిరీల్లో రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు ఉండగా, ఇప్పుడు అందరికీ ఒకే విధంగా రూ.5లక్షలు చేశామన్నారు. బార్ వ్యాపారంలోకి కొత్తవారు రావాలనే ఉద్దేశంతో ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరి చేశామని, దీనివల్ల గుత్తాధిపత్యం తగ్గుతుందని చెప్పారు. లైసెన్స్ ఫీజు ఆరు విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు.బార్ల పనివేళలను ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు కాకుండా ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు మార్చామన్నారు.