Share News

AP New Bar Policy: ఇలాగైతే బార్‌ పాలసీ కష్టమే

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:41 AM

ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న బార్‌ పాల సీ సజావుగా సాగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా మ ద్యం వ్యాపారుల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

AP New Bar Policy: ఇలాగైతే బార్‌ పాలసీ కష్టమే

  • ప్రతి బార్‌కు 4 దరఖాస్తులు తప్పనిసరి

  • ఒక్కోదానికి రూ.5 లక్షలు రుసుము

  • పాలసీపై జిల్లాల్లో వ్యాపారుల సమావేశాలు

  • దరఖాస్తులు చేయకూడదని ప్రాథమిక నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న బార్‌ పాలసీ సజావుగా సాగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా మ ద్యం వ్యాపారుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వం పెడుతున్న నిబంధనలతో వ్యాపారం చేయలేమనే నిర్ణయానికి వస్తున్నారు. అసలు బార్‌ కోసం దరఖాస్తులే చేయకూడదని వ్యాపారులు ప్రాథమికంగా నిర్ణయుంచారు. గత నాలుగు రోజుల్లో మూడు జిల్లాలు మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో వ్యాపారు లు సమావేశాలు నిర్వహించారు. ఎవరైనా కొత్తవారు వస్తే సరే గానీ, తమలో ఎవరూ దరఖాస్తు చేయకూడదని వారు నిర్ణయించారు. ప్రధానంగా ప్రతి బార్‌కు 4 దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధన, ఇష్యూ ప్రైస్‌పై 15 శాతం అదనంగా అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌(ఏఆర్‌ఈటీ) వసూలు అంశాల పై వ్యాపారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త బార్‌ పాలసీలో ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తు లు తప్పనిసరిగా రావాలనే నిబంధన పెట్టింది. అంటే.. ఏదైనా బార్‌కు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే దానికి లాటరీ తీయకుండా ఆపేస్తా రు. దీంతో బార్‌ లైసెన్స్‌ కావాలనుకునే వారు కచ్చితంగా 4 దరఖాస్తులు సమర్పించాలి. ఒక్కో దరఖాస్తుకు రూ.5 లక్షలు రుసుము. అయితే లైసెన్స్‌ వచ్చినా, రాకపోయినా దరఖాస్తు రుసుము తిరిగి ఇవ్వరు. దీంతో లైసెన్స్‌ కావాలనుకునేవారు వేర్వేరు పేర్లతో రూ.20 లక్షలు వెచ్చించి దరఖాస్తులు సమర్పించాలి. మరోవైపు గత ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై అదనంగా విధించిన ఏఆర్‌ఈటీని ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సాధారణంగా మద్యం షాపులకు ఇష్యూ ప్రైస్‌పై మద్యం సరఫరా చేస్తారు. అంటే ఎమ్మార్పీలో లైసెన్సీకి ఇచ్చే మార్జిన్‌ మినహాయించుకుని మద్యం ఇస్తారు. ఉదాహరణకు ఒక సీసా ఎమ్మార్పీ రూ.100 అయితే, షాపులకు రూ.86కే సరఫరా చేస్తారు.రూ.14 షాపులకు దక్కుతుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యానికి ఇష్యూ ప్రైస్‌పై అదనంగా ఏఆర్‌ఈటీని విధించింది.


అప్పట్లో రాజకీయ కారణాల నేపథ్యంలో విధించిన ఈ ఏఆర్‌ఈటీని ఈ ప్రభుత్వం కూడా తొలగించలేదు. ఈ ప్రభుత్వంలో పన్నులు సవరించినప్పుడు 15శాతం అదనంగా ఏఆర్‌ఈటీ చెల్లించాలనే నిబంధన పెట్టారు. దానివల్ల ఏడాదికి సగటున రూ.40లక్షలు అదనంగా చెల్లిస్తున్నామని లైసెన్సీలు అంటున్నారు. దానిని తొలగించాలని కోరారు. ఏఆర్‌ఈటీని తొలగిస్తే ఏడాదికి రూ.240 కోట్ల ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయాలతో పాటు మరోవైపు లైసెన్స్‌ ఫీజులను భారీ గా పెంచింది.2022లో ఇచ్చిన పాలసీలో గరిష్ఠ ఫీజు రూ.50 లక్షలు కాగా, ఇప్పుడు రూ.75 లక్షలు చేశారు. అప్పట్లో వేలం పద్ధతిలో నిర్వహించగా, ఇప్పుడు లాటరీ ద్వారా కేటాయించనున్నారు. అప్ప ట్లో వేలం నిర్వహించినా పది శాతం బార్లకు మిన హా ఎవరూ కనీస ధరను దాటి పాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి రూ.25 లక్షలు పెంచడంతో అది భారం అవుతుందని వ్యాపారులు అంటున్నారు. ఇం త ప్రతికూల వాతావరణంలో బార్‌ లైసెన్స్‌ తీసుకోవడం అనవసరమని వ్యాపారులు భావిస్తున్నారు.తాజాగా మద్యం షాపుల్లో పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతివ్వడం కూడా బార్‌లపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరోవైపు బార్‌ లైసెన్స్‌ తీసుకున్నా ప్రతి మూడేళ్లకోసారి కొత్తగా లైసెన్స్‌ సాధించుకోవాలి. వాస్తవానికి 2022కు ముందు దాదాపు పాతికేళ్లుగా బార్‌ల లైసెన్స్‌లు రెన్యువల్‌ మాత్రమే చేస్తూ వస్తున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 05:41 AM