Share News

New Bar Policy: రండి... దరఖాస్తు చేయండి

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:07 AM

గత పాలసీతో పోలిస్తే భారీగా లైసెన్స్‌ ఫీజులు తగ్గించాం. దరఖాస్తు రుసుములు ఏకీకృతం చేశాం. లైసెన్స్‌ ఫీజులను ఆరు వాయిదాల్లో కట్టే వెసులుబాటు..

New Bar Policy: రండి... దరఖాస్తు చేయండి

  • నూతన బార్‌ పాలసీ విజయవంతానికి ఎక్సైజ్‌ శాఖ తీవ్ర ప్రయత్నాలు

  • గతానికి భిన్నంగా విస్తృత ప్రచారం

  • నిబంధనలపై వ్యతిరేకతతో కొత్త వ్యూహం

  • రెండు రోజుల్లో ఒక్క దరఖాస్తూ రాలేదు

  • లక్ష్యం మాత్రం 3,360 అప్లికేషన్లు

  • అధికారులతో మంత్రి కొల్లు వర్చువల్‌ భేటీ

  • బార్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘గత పాలసీతో పోలిస్తే భారీగా లైసెన్స్‌ ఫీజులు తగ్గించాం. దరఖాస్తు రుసుములు ఏకీకృతం చేశాం. లైసెన్స్‌ ఫీజులను ఆరు వాయిదాల్లో కట్టే వెసులుబాటు కల్పించాం. పనివేళలు పెంచాం’ అంటూ ఎక్సైజ్‌ శాఖ గతానికి భిన్నంగా నూతన బార్‌ పాలసీపై విస్తృత ప్రచారం ప్రారంభించింది. మీడియా సమావేశాలు పెట్టి మరీ పాలసీపై ప్రచారం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చా రు. ఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కొత్త పాలసీలో వ్యాపారులకు చేకూర్చిన ప్రయోజనాలను వివరించారు. పాలసీ నిబంధనలపై మద్యం వ్యాపారుల్లో వ్యతిరేకత ఉంది. జిల్లాల వారీగా ముందుగానే సమావేశాలు నిర్వహించుకున్న వారు.. పాలసీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పాలసీపై ప్రతికూలత ఏర్పడుతుందని గ్రహించిన ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాలసీ విఫలమవుతుందనే ప్రచారం పెరగడంతో.. విజయవంతం చేయాలని జిల్లాల అధికారులను ఆదేశిస్తున్నారు.


నాలుగు దరఖాస్తులు వస్తేనే..

సాధారణంగా ఏ పాలసీలోనైనా బార్‌గానీ, షాపుగానీ కావాలంటే ఒక దరఖాస్తు సమర్పిస్తారు. కొంతమంది ఎక్కువ దరఖాస్తులు వేస్తే ఎక్కువ అవకాశం ఉంటుందని భావించి ఆ విధంగా చేస్తారు. అయితే ఈ బార్‌ పాలసీలో ఒక దరఖాస్తు అంటే నాలుగు దరఖాస్తులు వేయాలనే నిబంధన అనధికారికంగా అమలవుతోంది. ఒక బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీసి లైసెన్స్‌ కేటాయిస్తారు. మూడు వచ్చినా లాటరీ తీయరు. అందువల్ల ఫలానా బార్‌ కావాలనుకునే వ్యాపారి తప్పనిసరిగా నాలుగు దరఖాస్తులు సమర్పించాలి. ఎందుకంటే షాపుల పాలసీ తరహాలో బార్లకు ఎక్కువ దరఖాస్తులు రావు. 2022లో పాలసీ ప్రకటించినప్పుడు సగటున ఒక బార్‌కు 1.5 దరఖాస్తులు వచ్చాయి. పెద్ద నగరాల్లో ఒకటికి మించి దరఖాస్తులు ఎక్కడా దాఖలు కాలేదు.

రిజిస్ర్టేషనే.. ఫీజు చెల్లించలేదు!

ఈనెల 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా.. 50 మంది రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. కానీ రూ.5 లక్షల రుసుము ఎవరూ చెల్లించలేదు. దీంతో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 840 బార్లకు కనీసం నాలుగు చొప్పున అంటే 3,360 దరఖాస్తులు రావాలి. గతేడాది మద్యం షాపుల పాలసీ సమయంలో ఏ షాపునకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. దానివల్ల ఎక్కడ పోటీ తక్కువ ఉందో.. ఆ షాపులకు కొత్తవారు దరఖాస్తు చేశారు. అయితే కొత్త బార్‌ పాలసీకి దరఖాస్తులు పెద్దగా రావేమోనన్న ప్రచారం నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య అందరికీ కనిపించకుండా వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే వివరాలు కనిపించేలా చేశారు. అలాగే మంగళవారం ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు... జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాలసీ వ్యాపారులకు అనుకూలంగా ఉందని, విస్తృత ప్రచారంతో వీలైనంత ఎక్కువ దరఖాస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్‌లో అతిపెద్ద పాలసీగా భావించే షాపుల పాలసీ సమయంలోనూ ఇంత ప్రచారం చేయలేదు. గీత కులాలకు 340 షాపులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయాన్ని కూడా ఉన్నతాధికారులు దాచిపెట్టారు.


ఇవీ ప్రతికూలతలు

ఒకదానికి ఫీజు రూ.5 లక్షల చొప్పున నాలుగు దరఖాస్తులు సమర్పించాలంటే రూ.20 లక్షలు వెచ్చించాలి. ఇది వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు బార్లకు ఇచ్చే మద్యంపై అదనంగా 15 శాతం ఏఆర్‌ఈటీ పన్ను వసూలు చేస్తున్నారు. దీన్ని తొలగించాలని వ్యాపారులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆర్థిక శాఖ అంగీకరించలేదు. అలాగే మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇచ్చి, అక్కడే తాగే వెసులుబాటు కల్పించారు. మరోవైపు 80 శాతానికి పైగా బార్లకు లైసెన్స్‌ ఫీజులు పెరిగాయి. గత పాలసీలో గొప్పలకు పోయి కొంత మంది భారీగా వేలం పాడి బార్లు దక్కించుకున్నారు. ఆ బార్లకే లైసెన్స్‌ ఫీజులు తగ్గాయి. ఈ నేపథ్యంలో బార్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని ప్రస్తుత లైసెన్సీలు భావిస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.

Updated Date - Aug 20 , 2025 | 05:07 AM