AP Liquor Policy: బోర్డర్ మందు బంద్
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:54 AM
ఏపీలో అమలు చేస్తున్న నూతన మద్యం విధానం రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపిస్తుండగా, పొరుగు రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం ఢమాల్
కర్ణాటకలో ఏటా 10 శాతం ఉన్న వృద్ధి రేటు 0.47 శాతానికి పడిపోయిందన్న అధికారులు
తెలంగాణలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఖమ్మంలో నెలకు రూ.10 కోట్ల ఆదాయం హుష్
నల్గొండలో 30 శాతానికి పడిపోయిన విక్రయం
నాణ్యమైన మద్యంతో ఏపీలో అమ్మకం పైపైకి
రాష్ట్రంలో లిక్కర్ 24శాతం , బీరు 129శాతం పెరుగుదల
విలువ పరంగా చూస్తే 58 శాతం మేరకు పెంపు
ఒక్క త్రైమాసికంలోనే 849 కోట్ల అదనపు ఆదాయం
గతంలో ఇదంతా పక్క రాష్ర్టాలకు చేరిన వైనం
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ కారణంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమ్మకాలు తగ్గాయి. రెండు రాష్ర్టాల మధ్య మద్యం ధరల్లో వ్యత్యాసం ఉంది. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని, అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల మద్యం అక్రమ అమ్మకాలు కూడా తగ్గాయి.
- కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ వెంకటేశ్ వ్యాఖ్యలివి. కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మద్యం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
ఏపీలో అమలు చేస్తున్న నూతన మద్యం విధానం రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపిస్తుండగా, పొరుగు రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయించేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు మద్యం ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఉదాహరణకు తెలంగాణతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. జగన్ హయాంలో ఈ జిల్లాలో నెలకు 4 వేల కేసుల మద్యం అమ్మితే, ఇప్పుడు అది 12వేల కేసులకు చేరింది. అదేంటి జగన్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి అంటే మంచిదే కదా అనుకుంటే పొరపాటుపడినట్లే. మద్యం అమ్మకాలు తగ్గాయి. కానీ, మందుబాబులు తాగుడుకు దూరం కాలేదు.
పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి(అప్పట్లో ఏపీతో పోల్చితే తక్కువ ధర) మందు కొనుక్కుని తాగారు. దానివల్ల రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం తెలంగాణకు పోయింది. జే బ్రాండ్లతో ఏపీ ఖజానా నష్టపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ సీన్ రివర్స్ అయింది. సరిహద్దు రాష్ట్రాల మద్యం బంద్ అయింది. దీంతో జగన్ హయాంలో కర్ణాటకలో.. ఏటా సగటున 10 శాతం ఉన్న వృద్ధి... ఇప్పుడు 0.47 శాతానికి పడిపోయింది. ఉదాహరణకు 2023-24లో కర్ణాటకలో 705 లక్షల కేసుల మద్యం అమ్ముడైంది. 2024-25లో ఇది 10 శాతం చొప్పున పెరగి సుమారు 775 లక్షల కేసుల మద్యం అమ్మాలి. కానీ, 708 లక్షల కేసుల మద్యమే విక్రయించారు. అంటే, ఏపీ ప్రభావంతో కర్ణాటక మద్యం అమ్మకాలు పెరగలేదు. వాస్తవానికి సాధారణంగా అన్ని రాష్ర్టాల్లోనూ మద్యం అమ్మకాల్లో ఏటా సుమారు 10శాతం వృద్ధి ఉంటుంది. ఏపీ పాలసీతో కర్ణాటకలో ఆ వృద్ధి రేటు మాయమైపోయింది. 2024 వరకు కర్ణాటక మద్యం విచ్చలవిడిగా ఏపీలోకి ప్రవేశించేది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కట్టిన మద్యాన్ని ఇక్కడి వినియోగదారులు తాగేవారు. ఫలితంగా మన ప్రజలు తాగిన మద్యానికి ఆ రాష్ర్టానికి ఆదాయం వెళ్లింది. ఇప్పుడు దానికి రివర్స్‌లో ఏపీ మద్యం కర్ణాటకలోకి ప్రవేశిస్తోంది. ఏపీలో క్వార్టర్ రూ.99కే జాతీయ స్థాయి కంపెనీల నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడంతో అక్కడి వారు కూడా ఏపీ సరిహద్దు జిల్లాలకు వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరి నెలలోనే రూ.10 కోట్ల మేర అమ్మకాలు తగ్గిపోయాయి. ఏపీలో మద్యం ధరలు తగ్గిపోవడం, నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడంతో తెలంగాణలో మద్యం కొనేందుకు ఏపీకి చెందిన వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఏపీ మద్యం పాలసీ కారణంగా తమకు 30శాతం అమ్మకాలు పడిపోయాయని నల్గొండకు చెందిన ఓ మద్యం షాపు యజమాని తెలిపారు.
18 వేల కోట్లు పక్కరాష్ట్రాలకు!
పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి ‘జే’ బ్రాండ్లు తెచ్చిన గత ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక వనరులను తీవ్రంగా దెబ్బతీసింది. ఒక దశలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోతే అది జగన్ గొప్పతనం అనీ, తాగేవారు తగ్గిపోయారని అప్పటి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ తీరా చూస్తే రాష్ట్రంలో తాగేవారి సంఖ్య ఎక్కడా తగ్గలేదు. వారు ఇక్కడి ధరలు, నాసిరకం మద్యం భరించలేక.. పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేవారు. దీంతో మన రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ర్టాలకు తరలిపోయింది. ఫలితంగా జగన్ ఐదేళ్ల పాలనలో మద్యంపై ఏకంగా రూ.18 వేల కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల పక్క రాష్ర్టాలు భారీగా లాభపడ్డాయి.
అప్పట్లో.. సరిహద్దులు హాట్ కేక్‌లు!
జగన్ హయాంలో.. అప్పటి తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీ ప్రకటించినప్పుడు ఏపీ సరిహద్దులోని షాపులను వ్యాపారులు హాట్ కేకుల్లా భావించి.. భారీగా మొత్తాలకు దక్కించుకున్నారు. బోర్డర్‌లో తెలంగాణ మద్యం షాపుల్లో అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. ఒక దశలో దీనిపై తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి చర్చ కూడా జరిగింది. ఏపీ సరిహద్దు షాపుల్లో మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా పోతోందని అప్పటి అధికారులు ప్రభుత్వానికి తెలపగా.. ‘‘ఆదాయం వస్తున్నప్పుడు ఎవరు తాగితే ఏంటి?.’’ అని అప్పటి ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత ఏపీలో మద్యం ధరలు కొంత మేరకు తగ్గించడంతో అమ్మకాలు క్రమంగా పెరిగాయి. అయినా సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం అమ్మకాలు పెరగలేదు. కాగా, రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే భారీగా అదనపు ఆదాయం వచ్చింది. లిక్కర్‌లో 23.71శాతం, బీరులో 128.7శాతం అమ్మకాలు పెరిగాయి. విలువ పరంగా చూస్తే 11.33 శాతం పెరిగింది. 2024-25 మొదటి త్రైమాసికంలో మద్యంపై రూ.6,050 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది తొలి 3 మాసాల్లో రూ.6,899 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క త్రైమాసికంలోనే రూ.849 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది.
నాడు విచ్చలవిడిగా ఎన్‌డీపీఎల్
ఏ రాష్ట్రంలో మద్యం అమ్మితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికే పన్నులు చెందాలి. ఉదాహరణకు ఒక కంపెనీ ఏపీకి మద్యం సరఫరా చేస్తే దానిపై ‘సేల్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అని ముద్రిస్తుంది. ఆ మద్యం ఇతర రాష్ర్టాలకు ఎన్‌డీపీఎల్ అవుతుంది. అయితే, గత ప్రభుత్వంలో ‘జే’ బ్రాండ్ల కారణంగా అనేక మంది ఎన్‌డీపీఎల్ వ్యాపారం చేశారు. ముఖ్యంగా సరిహద్దులకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పక్క రాష్ర్టాల మద్యం ఏరులై పారింది. రోజూ వేలకు పైగా కేసులు పక్క రాష్ర్టాల నుంచి ఏపీలోకి ప్రవేశిస్తుంటే అధికారులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. దానికి కారణం అప్పట్లో ఈ అమ్మకాల వెనుక వైసీపీ నాయకులే ఉన్నారు. మాచర్ల ప్రాంతంలో ఓ కీలక నేత సహకారంతోనే ఏపీలో ఎన్‌డీపీఎల్ అక్రమ అమ్మకాలు కొనసాగాయి. అలాగే, ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేతలే ఎన్‌డీపీఎల్ వెనుక ఉన్నారు.
ప్రభుత్వం మారాక.. మార్పు ఇదీ!
జగన్ హయాంలో చివరి ఏడాది అయిన 2023 నవంబరు నుంచి 2024 జూన్ వరకు రూ.44.17 కోట్ల మద్యం అమ్ముడైంది. అందులో 51,644 కేసుల లిక్కర్, 9,916 కేసుల బీర్ ఉంది.
కూటమి వచ్చిన తర్వాత, 2024 నవంబరు నుంచి 2025 జూన్ వరకు రూ.69.58 కోట్ల మద్యం అమ్మారు. 92,964 కేసుల లిక్కర్, 45,538 కేసుల బీర్ విక్రయించారు. లిక్కర్‌లో 80 శాతం, బీర్‌లో 359ు అమ్మకాలు పెరిగాయి. విలువ పరంగా 58 శాతం పెరిగింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ ప్రభుత్వం లో నెలకు 4482 కేసులు అమ్మేవారు. దాని విలువ రూ.2.67 కోట్లు. కొత్త మద్యం పాలసీతో నెలకు 8,100 కేసులు అమ్ముతున్నారు. విలువ రూ.4.53 కోట్లు.
చిత్తూరు జిల్లాలో 40 నుంచి 50శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. కర్ణాటక నుంచి జిల్లాకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్) పూర్తిగా ఆగిపోయింది.
శ్రీసత్యసాయి జిల్లా, పరిగిలో ఒక్కో షాపులో రోజుకు రూ.30 నుంచి రూ.40 వేల మేరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు అది రూ.2 లక్షలు దాటింది.
చిలమత్తూరులో గతంలో రూ.30 వేల వ్యాపారం జరిగితే ఇప్పుడు రూ.2.75 లక్షల వ్యాపారం జరుగుతోంది.
తెలంగాణకు సమీపంలోని నూజివీడు, జంగారెడ్డి గూ డెంలో నెలకు రూ.10 కోట్ల మేర అమ్మకాలుపెరిగాయి.