Share News

AP Budget Based Payments Rules: బడ్జెట్‌ ఉన్నంత వరకే పనులు

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:20 AM

ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. బడ్జెట్‌ కేటాయింపుల మేరకే పనులు, చెల్లింపులు జరగాలన్నది స్పష్టం చేసింది

AP Budget Based Payments Rules: బడ్జెట్‌ ఉన్నంత వరకే పనులు

  • చెల్లింపులపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపు, వాటి అప్‌లోడ్‌పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. గత నెల (మార్చి) 31వ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ రద్దవుతాయి. 2025-26 బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా ఆ బిల్లులను మళ్లీ సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్‌ చేయాలి. ఈ విధానంలో ప్రతి డ్రాయింగ్‌-డి్‌సబర్సింగ్‌ అధికారి(డీడీవో)కి కొంత బడ్జెట్‌ కేటాయిస్తారు. దాని ప్రకారం.. రెండు త్రైమాసికాల్లో కలిపి 35 శాతం మించకుండా పనులు చేయాలి. బిల్లులు కూడా అదే ప్రాతిపదికన అప్‌లోడ్‌ చేయాలి. 100 శాతం నిధులను నాలుగు త్రైమాసికాల్లో ఖర్చు చేయాలి. మొత్తం పనులు.. కేటాయించిన బడ్జెట్‌ను మించకూడదు. గతంలో బడ్జెట్‌తో సంబంధం లేకుండా పనులు చేసేవారు. బిల్లులు కూడా అదే స్థాయిలో అప్‌లోడ్‌ చేసేవారు. బడ్జెట్‌కు, జరిగిన పనుల విలువకు భారీ వ్యత్యాసం ఉండేది. పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయేవి. ఈ సమస్యకు స్వస్తి పలకడానికి ప్రభుత్వం తాజా విధానం తీసుకొచ్చింది.


పాత బిల్లుల పరిస్థితేంటో..!

పాత బిల్లులపై ఈ మార్గదర్శకాల్లో స్పష్టత లేదు. కొత్త బడ్జెట్‌లో వాటికి కేటాయింపులు ఉంటే తిరిగి వ్యవస్థలోకి వస్తాయి. లేదంటే బడ్జెట్‌ కేటాయించేవరకు ఎదురుచూడాలి. అలా వ్యవస్థలోకి వచ్చిన బిల్లులు పాతవే అయినా.. కొత్తగా మళ్లీ వ్యవస్థలోకి వస్తున్నందున అవి కొత్త బిల్లులవుతాయి. ‘తొలుత వచ్చినవారికే తొలి ప్రాధాన్యం (ఫిఫో)’ విధానం ప్రకారం సీనియర్‌ బిల్లులే అయినప్పటికీ చెల్లింపుల్లో వాటికి తొలి ప్రాధాన్యం లభించదు. పైగా డీడీవోలకు కేటాయించిన బడ్జెట్‌ పాత బిల్లుల చెల్లింపులకు సరిపోతుందా లేదా అనేది ప్రశ్నార్థకం. దీనిపై సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను సంప్రదించగా.. ’పాత బిల్లులను రద్దుచేసేది డీడీవో గనుక.. ఏది సీనియర్‌ బిల్లో ఆ అధికారికి తెలుస్తుంది. దాని ప్రకారం పాత బిల్లులకు ప్రాధాన్యం లభిస్తుంది’ అని వివరణ ఇచ్చారు.

ప్రత్యేకంగా నిధులివ్వాలి: చిన్న కాంట్రాక్టర్లు

ఇకపై జరగబోయే పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఉపయోగపడతాయని.. కానీ పాత బిల్లులకు ఈ విధానంలో ప్రాధాన్యం లభించదని చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డీడీవోల వద్ద బడ్జెట్‌ తక్కువగా ఉన్న సందర్భాల్లో చిన్న బిల్లులకు ప్రాధాన్యం ఇవ్వడం అనుమానమేనని చెప్పారు. గత ప్రభుత్వం నాబార్డు నిధులను మళ్లించగా.. ఈ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్ల మేలు కోసం బడ్జెట్‌ కేటాయించిందని గుర్తుచేశారు. అయినా బడ్జెట్‌ ఉన్నప్పటికీ బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్‌ఎంఎస్‌లో అవకాశం కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Apr 11 , 2025 | 06:20 AM