AP Specialty Hospitals Association: నేటి నుంచి వైద్య సేవలు బంద్
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:03 AM
రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో శుక్రవారం నుంచి వైద్య సేవలు బంద్ కానున్నాయి. 10నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు...
సమ్మెలోకి నెట్‌వర్క్ ఆస్పత్రులు.. సేవలు కొనసాగించండి.. మంత్రి వినతి
సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం
ఆరోగ్య సేవలు కొనసాగించండి
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో శుక్రవారం నుంచి వైద్య సేవలు బంద్ కానున్నాయి. 10నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) గతనెల 25నే అధికారులకు లేఖ రాసింది. భారీ బకాయిల నేపథ్యంలో ఆస్పత్రులు నడపలేని పరిస్థితికి వచ్చామని, వెంటనే రూ.2,700 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించింది. లేదంటే అక్టోబరు 10 నుంచి వైద్య సేవలు అందించలేమని స్పష్టంచేసింది. ఆరోగ్యశాఖ అధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అనేకసార్లు సంప్రదింపులు జరిపినా ఫలితంలేదు. దీంతో యాజమాన్యాలు వైద్య సేవలు నిలిపివేసేందుకు సిద్ధమయ్యాయి. సమ్మెకు దిగడానికి కారణాలు, తమ ఆవేదనను వ్యక్తీకరిస్తూ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది. తమకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నంచి రావలసిన బకాయిలు రూ.2,700 కోట్ల పైమాటేనని, ఇవి ఏ నెలకా నెల పెరుగుతున్నాయో తప్ప తగ్గడం లేదని వాపోయింది. ఆస్పత్రులు ఇక నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వ పెద్దలకు, ట్రస్ట్ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా పరిష్కరించలేదన్నారు. వారం రోజులుగా జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూనే ఉన్నామని చెప్పారు. ‘బకాయిల విడుదల కోసం ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా, అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తామని చెబుతున్నారే తప్ప..ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ కనిపించడం లేదు. ఆస్పత్రుల బకాయిల గురించి మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు.
కానీ చేతల్లో మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత నెల 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది’ అని తెలిపారు. తమ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఏడాదిగా తాము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు.
వైద్య సేవలు ఆపొద్దు: మంత్రి
నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు వెళ్తుండడంపై వైద్య ఆరోగ్యమంత్రి సత్యకుమార్ స్పందించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. వైద్య సేవలను ఆపొద్దని ఆస్పత్రులకు విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి రూ.2,500 కోట్ల బకాయిలున్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక అందించిన సేవలకు కూడా కలిపి ఇప్పటి వరకూ రూ.3,800 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.670 కోట్ల బిల్లులను ట్రస్ట్ అధికారులు సీఎ్‌ఫఎంఎ్‌సకు అప్‌లోడ్ చేశారని, మరో రూ.2.000కోట్ల బిల్లులు స్ర్కూటినీ దశలో ఉన్నాయన్నారు. బిల్లులు చెల్లించకుండా ఆస్పత్రులు నడవడం అసాధ్యమని తమకు తెలుసని.. ఇటీవలే రూ.250 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల కారణంగా ఈ ఇబ్బందికర పరిస్థితి వచ్చిందన్నారు.