Share News

నేత్రపర్వం.. జ్యోతుల మహోత్సవం

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:40 PM

తొగట వీర క్షత్రియ వంశస్థుల ఇలవేల్పు అయిన చౌడేశ్వరి మాత పున్నమి తిరుణాల ఓర్వకల్లులో సోమవారం రాత్రి నేత్రపర్యంగా సాగింది.

   నేత్రపర్వం.. జ్యోతుల మహోత్సవం
ఓర్వకల్లులో జ్యోతులతో చిందులు వేస్తున్న కళాకారులు

వేలాదిగా తరలి వచ్చిన భక్త జనం

చౌడమ్మ ఉత్సవాల్లో అలరించిన నృత్య ప్రదర్శనలు

ఓర్వకల్లు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : తొగట వీర క్షత్రియ వంశస్థుల ఇలవేల్పు అయిన చౌడేశ్వరి మాత పున్నమి తిరుణాల ఓర్వకల్లులో సోమవారం రాత్రి నేత్రపర్యంగా సాగింది. ఉదయం అమ్మవారికి అర్చకులు శాసో్త్రక్తంగా విశిష్ట పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టు వసా్త్రలతో చౌడేశ్వరి దేవిని ముస్తాబు చేసి, సింహ వాహనంపై అధిష్టించి అశేష భక్త జనం మధ్య ఉరేగించారు. అనంతరం అమ్మవారికి భక్తులు సమర్పించిన 27 జ్యోతుల ఊరేగింపు ఉత్సవాలు సోమవారం రాత్రి 12.00 గంటలకు ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామున ముగిశాయి. భక్తులు జ్యోతులను తలపై పెట్టుకొని మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య గ్రామ పురవీధులలో భారీ ఊరేగింపు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి జ్యోతుల ఉత్సవాలను తిలకించారు. జ్యోతుల ఊరేగింపులో తొగట వీర క్షత్రియుల సంప్రదాయ నృత్య ప్రదర్శన, నందికోల సేవ, ఖడ్గ శావ, చెక్క భజన, కీలు గుర్రం, గొరవయ్యల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు అమ్మవారికి కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:40 PM