Share News

CM Chandrababu Naidu: నేతన్న భరోసా ఏడాదికి 25 వేలు

ABN , Publish Date - Aug 08 , 2025 | 03:47 AM

చేనేత కార్మికులకు చేయూత అందించడానికి నేతన్న భరోసా కింద ప్రతి ఏటా రూ.25వేలు ఇచ్చే బాధ్యత నాది అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

CM Chandrababu Naidu: నేతన్న భరోసా ఏడాదికి 25 వేలు

  • చేనేత కార్మికులకు 546 కోట్లతో పింఛన్లు

  • నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

  • పవర్‌ మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం

  • 5శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం

  • ఓఎన్‌డీసీ ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్‌

  • చేనేతల సంక్షేమానికి యాక్షన్‌ ప్లాన్‌

  • 93 వేల కుటుంబాలకు ప్రయోజనం

  • రాష్ట్రమంతటా వీవర్‌ శాలల ఏర్పాటు

  • అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం

  • అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి

  • ఆదరణ-3 కింద ఆధునిక మగ్గాలు

  • చేనేత దినోత్సవ సభలో సీఎం హామీలు

మొదటి నుంచీ చేనేత సంక్షేమానికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చేనేతల సంక్షేమం కోసమే ఎక్కువగా పోరాడాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేనేత కార్మికులకు ఏ లోటూ రానివ్వను.

గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లను నిలిపివేశారు. నూలుపై సబ్సిడీ ఎత్తివేశారు. ఐదేళ్ల పాటు ఈ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది.

వీవర్‌ శాల పేరుతో ఓ వినూత్నమైన కార్యక్రమానికి లోకేశ్‌ శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఈ మోడల్‌ విజయవంతమైతే రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

మంగళగిరి/గుంటూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ‘చేనేత కార్మికులకు చేయూత అందించడానికి ‘నేతన్న భరోసా’ కింద ప్రతి ఏటా రూ.25వేలు ఇచ్చే బాధ్యత నాది’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఆటోనగర్‌లోని వీవర్‌ శాల వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇంట్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. తద్వారా ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.15వేల భారం తగ్గుతుంది. అది కూడా తక్షణం అమలు చేయడం ప్రారంభిస్తున్నాం.

Untitled-3 copy.jpg


పవర్‌లూమ్‌ మగ్గాలు ఉన్నవారికి నెలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. అందుకోసం ఏటా రూ.190 కోట్ల ఖర్చవుతుంది. త్రిఫ్ట్‌ ఫండ్‌ను పునరుద్ధరించి 5,386 మందికి రూ.5కోట్లు విడుదల చేస్తున్నాం. 5శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఇందుకయ్యే రూ.15కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది’’ అంటూ సీఎం వరాల జల్లు కురిపించారు. 92,724మంది చేనేత కార్మికులకు రూ.546 కోట్లతో పింఛన్లను అందిస్తున్నామని తెలిపారు. చేనేతల సంక్షేమం కోసం త్వరలోనే యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి, 93వేల చేనేత కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేనేత బాంధవుడు.. స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘‘భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. నైపుణ్యం, సృజనాత్మక శక్తి కలబోత మన చేనేతలు. మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టినిల్లు. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మనదపల్లి, నందవరం, కొడుమూరు, ఎమ్మిగనూరు... ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి చేనేత ఒక సంపద. పొందూరు ఖద్దరును మహాత్మగాంధీ మెచ్చారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకోవడానికి ఆ చరిత్రే కారణం.’’


టీడీపీకి, నేతన్నకు అవినాభావ సంబంధం

‘‘తెలుగుదేశం పార్టీకి, నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే సగం ధరకే చీర, ధోవతి ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడింది చేనేత పరిశ్రమపైనే. సుమారు 1,22,644 కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు చేనేతలకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కృషి చేశాం. రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశాం. దీనికోసం ప్రతిపక్షాలతో పోరాడాం. చీరాలలో చేనేత రుణాల మాఫీ కోసం ధర్నా చేసిన చరిత్ర నాకుంది. 55,500 మంది చేనేత కార్మికులకు రూ.2లక్షల చొప్పున రూ.27 కోట్ల రుణాలు ఇచ్చాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. చేనేత కార్మికులకు తొలిసారిగా 50ఏళ్లకే పింఛన్‌ను ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ టీడీపీ.’’


గత ఐదేళ్లలో కుదేలు..

‘‘ఈ ఏడాది చేనేత పరిశ్రమ రూ.1,375 కోట్ల టర్నోవర్‌ సాధించింది. చేనేతల ఆదాయం 30 శాతం పెరిగింది. అయితే అది సరిపోదు. ఆధునిక మార్కెట్‌ను సొంతం చేసుకునేలా నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. నూలుపోగు వడికే కార్మికుడి నుంచి వినియోగదారుడి వరకూ అనుసంధానించే ఎకో సిస్టమ్‌ రూపొందించాలి. ఓపెన్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) కింద చేనేత ఉత్పత్తులను విస్తరించే ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే 2వేల చేనేత ఉత్పత్తులు ఇందులో రిజిస్టర్‌ అయ్యాయి.’’


రూ.74 కోట్లతో క్లస్టర్లు ఏర్పాటు

‘‘వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలలో రూ.74కోట్లతో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 1,374 మంది పనిచేసే అవకాశం ఉంటుంది. అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తాం. గతంలో ఆదరణ పథకం కింద సుమారు రూ.964 కోట్లు ఖర్చుచేసి వివిధ వృత్తిదారులకు అండగా ఉన్నాం. మళ్లీ ఆదరణ-3 కింద ఆధునిక మరమగ్గాలు ఇస్తాం. చేనేత రంగంలో ఆధునికతను తీసుకొచ్చే బాధ్యతను స్వీకరిస్తున్నాం. నేత కార్మికులకు ఆధునిక ఉపకరణాలకు తోడు ముడిసరుకులు ఇప్పించి సొంతగా నేసేవిధంగా తోడ్పాటును అందిస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల జీతాలను రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచాం. సెలూన్లకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇస్తున్నాం. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులు 50 శాతం సబ్సిడీపై ఇచ్చాం. బార్లలో కూడా వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాం. 259 మత్స్య కార్మికులకు కుటుంబాలకు రూ.21వేల వంతున ఆర్థిక సాయం అందించాం. జీవో 217 రద్దుచేశాం. సముద్రం పక్కన నాచు పెంచేందుకు మత్స్యకార మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. వడ్డెరలకు పది శాతం క్వారీలను రిజర్వు చేస్తాం. యాదవులు, కురబలకు సంక్షేమ పఽథకాలను పెద్దఎత్తున అమలుచేస్తాం.’’


బీసీలను గుండెల్లో పెట్టుకుంటాం

‘‘తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీని వీడకుండా అంటిపెట్టుకుంది బీసీలే. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, పల్నాడులో చంద్రయ్యలాంటి వారి త్యాగాలను మరువబోం. బీసీలను టీడీపీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. చట్ట సభల్లో కూడా బీసీలకు 33శాతం రిజర్వేషన్లు రావాలి. అది సాకారమయ్యే వరకూ పోరాడతాం. బీసీలపై ఏటా రూ.40వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 2లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. నామినేటెడ్‌ పదవుల్లో 30శాతం బీసీలకు ఇచ్చాం. చరిత్రలో ఎన్నడూ చూడనంత సంక్షేమాన్ని ఈ ఏడాదిలోనే చేసి చూపించాం. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించడం మనందరి అదృష్టం. మీ మంత్రి లోకేశ్‌ సూచన మేరకు ఆయన జయంతిని అధికారికంగా జరిపిస్తాం.’’


ఒక అడుగు ముందున్న లోకేశ్‌..

‘‘2019లో లోకేశ్‌ ఇక్కడి నుంచి 5వేల ఓట్లతో ఓడిపోయారు. తాను ఓడిన చోటే మంచి మెజారిటీతో గెలవాలని పట్టుదలతో ముందుకొచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి లోకేశ్‌ 91 వేల మెజారిటీతో గెలవడం ఓ చరిత్ర. 20 మగ్గాలతో ఇక్కడో వీవర్‌ శాల పెట్టారు. అదో ప్రయోగం. 3 వేల కుటుంబాలకు దుస్తులు పెట్టి, పట్టాలు అందించారు. ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి ఉండాలన్నది లోకేశ్‌ సంకల్పం. ఎమ్మెల్యేలందరూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. చేసిన పనులను గురించి ప్రజలకు ఎప్పకప్పుడు వివరించి చెప్పాలి. చాలామంది చేస్తున్నారు. వాళ్లందరికన్నా లోకేశ్‌ ఒకడుగు ముందే ఉన్నారు. ఏమాత్రం అవకాశం కుదిరినా నియోజకవర్గ ప్రజల మధ్యనే గడుపుతున్నారు. ఇదొక మంచి సంప్రదాయం.’’


మంగళగిరి చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటా: లోకేశ్‌

‘వివాహలు, ఇతర ఏ శుభకార్యాలకు వెళ్లినా వారికి మంగళగిరి చేనేత వస్త్రాలను బహుమతిగా ఇవ్వడాన్ని అలవాటుగా మార్చుకున్నా. మంగళగిరి చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటా’’ అని మంత్రి లోకేశ్‌ తెలిపారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చేనేత వృత్తిదారులను కార్మికులు అని సంబోధించడం కన్నా వారిని కళాకారులని చెప్పడమే సమంజసమని అన్నారు. మంగళగిరి చేనేతలంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. చేనేతల ఆదాయాన్ని వందశాతం రెట్టింపు చేయాలన్నదే తన లక్ష్యంగా ప్రకటించారు. తన సతీమణి బ్రాహ్మిణి ధరించిన మంగళగిరి చేనేత చీర బాగా వైరల్‌ కావడంతో ఓ షాపులో అదే రకం చీరలు 98 వరకు విక్రయించారని తెలిసి చాలా ఆనందించానని పేర్కొన్నారు. మంగళగిరిలో ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారు నడుస్తోందని, నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోకేశ్‌ వివరించారు.


నేత కార్మికులతో సీఎం ముఖాముఖి

శ్రీలక్ష్మి: సార్‌! చేనేత వృత్తిలో 20ఏళ్లుగా ఉన్నాం. నేను, మావారు రోజంతా పనిచేసినా నెలకు రూ.12, 13వేలు రావడం లేదు. మాకు ఆధునిక డిజైన్లలో శిక్షణ ఇప్పిస్తారా?

సీఎం: మీకు కొత్తగా ఓ పథకాన్ని పెట్టించి ఆధునిక డిజైన్లలో శిక్షణను ఇప్పించడంతో పాటు మీరు తయారుచేసిన వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయాన్ని కూడ కల్పించేలా చర్యలు తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తున్నాం.

గుంటి కమల: సార్‌! నేను 25 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాను. ఉచిత కరెంటు ఇస్తామంటున్నారు. దానికి మేము దరఖాస్తు చేసుకోవాలా? దీనిపై మాకు అవగాహన కల్పించండి.

సీఎం: ఈ రోజు 11వ జాతీయ చేనేత దినోత్సవం. చేనేతలకు ఉచిత కరెంటు పఽథకం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది. రాబోయే నెలలో మీరు బిల్లు కట్టే పనుండదు. చేనేత కార్మికులకైతే 200 యూనిట్లు, అదే మరమగ్గం ఇంట్లో ఉంటే 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. డిపార్టుమెంట్‌ వాళ్లు మీ ఇళ్లకు వచ్చి ఎన్యూమరేట్‌ చేసి పఽథకాన్ని మీకు ఈ రోజు నుంచే అమలుచేస్తారు.

Updated Date - Aug 08 , 2025 | 06:32 AM