Share News

గూడుపుఠాణి!

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:14 AM

కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో లీడ్‌ మేస్ర్తీల పేరిట గూడుపుఠాణి నడుస్తోంది. ఇన్‌స్పెక్టర్లు కొందరు లీడ్‌ మేస్ర్తీల పోస్టులను సృష్టించటం వెనుక స్వప్రయోజనాలు దాగున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌లో లీడ్‌ మేస్ర్తీలు ఉన్నారని సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానాలు పంపిన అధికారులు, ఏడాది తిరక్కుండానే మరో దరఖాస్తుకు అసలు లీడ్‌ మేస్ర్తీలే లేరంటూ సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచారు. లీడ్‌ మేస్ర్తీలే లేనపుడు నగరంలో 225 మందికిపైగా పనిచేస్తున్నారు. కమిషనర్‌ ఆదేశాలు లేకుండా అక్రమ వసూలు కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వీరిని నియమించుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గూడుపుఠాణి!

- కార్పొరేషన్‌లో లీడ్‌ మేస్ర్తీల విషయంపై విమర్శలు

- ఏడాది కిందట సమాచార హక్కు దరఖాస్తులో లీడ్‌ వర్కర్ల జాబితా ఇచ్చిన ప్రజారోగ్యశాఖ

- తాజాగా మరో సమాచార హక్కు దరఖాస్తుకు అసలు లీడ్‌ మేస్ర్తీలే లేరని సమాధానం

- పరస్పర విరుద్ధ సమాధానాలపై అనేక అనుమానాలు

- ఇప్పటికీ కొనసాగుతున్న లీడ్‌ మేస్ర్తీలు..

- వసూళ్ల కోసమే వీరిని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నియమించారని విమర్శలు

కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో లీడ్‌ మేస్ర్తీల పేరిట గూడుపుఠాణి నడుస్తోంది. ఇన్‌స్పెక్టర్లు కొందరు లీడ్‌ మేస్ర్తీల పోస్టులను సృష్టించటం వెనుక స్వప్రయోజనాలు దాగున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌లో లీడ్‌ మేస్ర్తీలు ఉన్నారని సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానాలు పంపిన అధికారులు, ఏడాది తిరక్కుండానే మరో దరఖాస్తుకు అసలు లీడ్‌ మేస్ర్తీలే లేరంటూ సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచారు. లీడ్‌ మేస్ర్తీలే లేనపుడు నగరంలో 225 మందికిపైగా పనిచేస్తున్నారు. కమిషనర్‌ ఆదేశాలు లేకుండా అక్రమ వసూలు కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వీరిని నియమించుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో అనధికారిక మేస్త్రీలు రాజ్యమేలుతున్నారు. అధికారికంగా లీడ్‌ మేస్ర్తీలు అనేవారు ఎక్కడా లేరన్న విషయాన్ని తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా కార్పొరేషన్‌ అధికారులు స్పష్టం చేశారు. 2024, జూలైలో సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తుకు నగరంలో లీడ్‌ మేస్ర్తీలు ఉన్నారని ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన లీడ్‌ వర్కర్ల జాబితాను కూడా సమాచార హక్కు దరఖాస్తుదారునికి అందించారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు లీడ్‌మేస్ర్తీలకు సంబంధించి వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు అస్సలు కార్పొరేషన్‌లో లీడ్‌ మేస్ర్తీలు ఎవరూ లేరని అధికారులు సమాధానం ఇచ్చారు. ఒక అర్ధ సంవత్సర కాలంగా లీడ్‌ వర్కర్లకు సంబంధించి వివాదం నలుగుతున్న నేపథ్యంలో, కార్పొరేషన్‌ అధికారులు ఈ మేరకు అసలు లీడ్‌ వర్కర్లే లేరని సమాధానం ఇచ్చారు. లీడ్‌ వర్కర్లు లేకపోతే లీడ్‌ మేస్ర్తీలుగా పనిచేసేవారంతా ఎవరన్నది సందేహంగా ఉంది. ప్రభుత్వ స్థాయిలో అనుమతులు తెచ్చుకోకుండా.. మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్డర్‌ లేకుండా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఏ విధంగా లీడ్‌ మేస్ర్తీలను నియమించుకుంటారన్నది నిగ్గుతేలాల్సిన విషయం.

విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 80 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం 40 మందే ఉండాలి. ఇది వేరే వివాదం. ప్రతి 40 వేల మందికి ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. ప్రతి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కింద ముగ్గురు శానిటరీ మేస్త్రీలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 120 మంది శానిటరీ మేస్ర్తీలు పనిచేయాల్సి ఉంది. నగరానికి 88 మంది శానిటరీ మేస్ర్తీలే ఉన్నారు. మరో 32 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అవసరం ఉంది. అవసరమైన శానిటరీ ఇన్‌స్పెక్టర్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి అనుమతులు తెచ్చుకోవచ్చు. కానీ, ఆ పని చేయకుండా అనధికారికంగా ఇష్టానుసారంగా మేస్ర్తీలను నియమించుకున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో అనధికారికంగా 225 మంది శానిటరీ లీడ్‌ మేస్ర్తీలను నియమించుకున్నారు. ఇప్పటికీ లీడ్‌ మేస్ర్తీలుగా పనిచేస్తున్నారు. వీరందరినీ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నియమించుకున్నారు. ప్రస్తుతం లీడ్‌ మేస్ర్తీలుగా పనిచేస్తున్న 225 మంది కూడా సాధారణ వర్కర్లే కావటం గమనార్హం. వర్కర్లనే ఒక గ్రూపునకు లీడ్‌ మేస్ర్తీగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అనధికారికంగా నియమించారు. తమకు నచ్చిన వర్కర్లను, తమ చెప్పుచేతల్లో ఉండే వర్కర్లను, తాము ఏ పని చెబితే ఆ పని చేసే వర్కర్లను నియమించుకున్నారు. శానిటరీ డివిజన్ల పరిధిలో కళ్యాణ మండపాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు ఎంపిక చేసిన ప్రాంతాలకు సంబంధించి అక్రమ వసూళ్లకు తెగపడటం కోసమే లీడ్‌ మేస్ర్తీలను తెరమీదకు తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. లీడ్‌ మేస్ర్తీలు ఇళ్ల దగ ్గర కూడా అక్రమ వసూళ్లకు తెగబడుతుంటారు. ప్రతి పనికీ ఓ రేటును నిర్ధారిస్తుంటారు. లీడ్‌ మేస్ర్తీలుగా చేసినా వారికి అదే జీతం ఉంటుంది. వసూలు చేసిన వాటిలో కొంత పర్సంటేజీని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారికి చెల్లిస్తారు. ఇలా తమ అక్రమ వ్యవహారాలను చక్కబెట్టుకోవటం కోసమే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లీడ్‌ మేస్ర్తీల పేరుతో కొంతమంది వర్కర్లకు పెత్తనం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Oct 15 , 2025 | 01:14 AM