Nellore SP Ajitha Vejendla: వ్యక్తిగత కక్షలకు కులాలతో ముడి
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:11 AM
ఎక్కడేం జరిగినా, దానికి కారణమేదైనా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు రాజేసే కుట్రలకు తెరలేపుతున్నారు. తాజాగా... నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వ్యక్తిగత, ఆర్థిక అంశాల కారణంగా జరిగిన హత్యను...
ఫేక్ ప్రచారంతో చిచ్చుపెట్టే ప్రయత్నాలు
గుడ్లూరు హత్య ఘటన తప్పుడు ప్రచారం
కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
నెల్లూరు/అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎక్కడేం జరిగినా, దానికి కారణమేదైనా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు రాజేసే కుట్రలకు తెరలేపుతున్నారు. తాజాగా... నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వ్యక్తిగత, ఆర్థిక అంశాల కారణంగా జరిగిన హత్యను... రెండు కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారు. దీనిని ఎంతమాత్రం సహించలేదని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ హత్యకు అసలు కారణాలను నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం మీడియాకు వివరించారు. గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడి నుంచి హరిశ్చంద్ర ప్రసాద్ రూ.2,30,000 అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగివ్వాలని రెండు నెలల కిందట లక్ష్మీనాయుడు డిమాండ్ చేయడంతో హరిశ్చంద్ర తన ట్రాక్టర్ ట్రక్‌ను అతడికి అప్పగించాడు. ఇంకా రూ.50 వేలు బాకీపడ్డాడు. ఇదే నేపథ్యంలో వారిమధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్ష్మీనాయుడిపై హరిశ్చంద్ర కక్ష పెంచుకున్నాడు. ఈనెల 2వ తేదీన లక్ష్మీనాయుడు మరో ఇద్దరితో బైక్‌పై వెళ్తుండగా... హరిశ్చంద్ర తన ఫార్చూనర్ కారుతో వారిని కావాలనే గుద్దాడు. ముగ్గురు కిందపడిపోయినా వదల్లేదు. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు మృతి చెందారు. పోలీసులు హరిశ్చంద్ర ప్రసాద్‌తో పాటు ఆయన తండ్రి మాధవరావును కూడా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఇదీ జరిగింది. కానీ... దీనిని రెండు కులాల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించేందుకు ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలూ మొదలయ్యాయి. ‘‘ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు.
వారిద్దరి మధ్య ఘర్షణకు ఎలాంటి కుల, మత వివాదాలు కారణం కాదు. బాఽధితుడికి నష్టపరిహారం చెల్లించేందుకు నిందితుడి ఆస్తులను గుర్తించి కోర్టుకు సమర్పించాం. కులం, మతం పేరుతో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తే బీఎన్‌ఎస్ 353(2)(3) కింద కేసులు నమోదు చేస్తాం’ అని పోలీసు వర్గాలు హెచ్చరించాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నాయి. ‘కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఫేక్ మనుషులనూ తయారుచేసి మాట్లాడిస్తున్నారు. ఈ కేసులో కూడా ఇలాంటి వీడియోలు వచ్చాయి. అవి తీసినవారిపై కేసులు పెడుతున్నాం’ అని ఎస్పీ చెప్పారు.