Share News

MP Vemireddy Prabhakar Reddy: క్వార్ట్జ్‌ పరిశ్రమ పెట్టను

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:51 AM

నెల్లూరు జిల్లా సైదాపురంలో క్వార్ట్జ్‌ పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ప్రకటించారు.

MP Vemireddy Prabhakar Reddy: క్వార్ట్జ్‌ పరిశ్రమ పెట్టను

  • ప్రతిపక్షాల విమర్శలతో కలత చెందా: వేమిరెడ్డి

నెల్లూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా సైదాపురంలో క్వార్ట్జ్‌ పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ప్రకటించారు. ఇటీవల క్వార్ట్జ్‌ విషయమై తనపై చేస్తున్న విమర్శలకు మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ ఉద్దేశంతోనే జిల్లాలో క్వార్ట్జ్‌ పరిశ్రమ నెలకొల్పాలనుకున్నాను. అయితే ఇటీవల ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు(ఆంధ్రజ్యోతి కాదు).. నేను క్వార్ట్జ్‌ రూపంలో వందల కోట్లు దోచుకుంటున్నట్లుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాను. కూటమి ప్రభుత్వ పెద్దల అనుమతితో రూ.400 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించాను. నా ప్రతినిధులను చైనా పంపి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. మన దగ్గర లభ్యమయ్యే క్వార్ట్జ్‌.. సోలార్‌ ప్లేట్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ పరికరాలకు ఏ విధంగా పనికి వస్తుందో అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు 19వేల టన్నుల క్వార్ట్జ్‌ కొనుగోలు చేసి చైనాకు ఎగుమతి చేశాం. ఇప్పటి వరకు పరిశ్రమ మొదలు కాలేదు.. మన క్వార్ట్జ్‌ ఎందుకు పనికి వస్తుందో అధ్యయనం జరుగలేదు.. అంతలోనే వందల కోట్లు దోచుకుంటున్నట్లు విమర్శించడం బాధ కలిగించింది. రాజకీయంగా నన్ను టార్గెట్‌ చేసుకున్న కొంత మంది నాయకులకు క్వార్ట్జ్‌ పరిశ్రమ ఆయుధంగా దొరికింది. వారికా అవకాశం ఇవ్వకూడదనే పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచన విరమించుకుంటున్నాను’ అని వెల్లడించారు. రాజకీయాలకు రాక ముందునుంచే తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని.. విమర్శలు తట్టుకోవడం తనకు చేతకాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. జిల్లా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన నుంచి వెనకడుగు వేయనని.. మరో పరిశ్రమ స్థాపించడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఇకనుంచి క్వార్ట్జ్‌ పరిశ్రమకు, తనకు సంబంధం లేదని, ఇంకా ఎవరైనా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే వారి కర్మకే వదిలేస్తున్నానని వేమిరెడ్డి అన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 04:52 AM