Share News

Resignation Announcement: నెల్లూరు మేయర్‌ స్రవంతి రాజీనామా

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:53 AM

నెల్లూరు మేయర్‌ పోట్టూరి స్రవంతి అవిశ్వాస తీర్మాన వ్యవహారం గత కొన్నిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతోంది.

Resignation Announcement: నెల్లూరు మేయర్‌ స్రవంతి రాజీనామా

  • నేడు కలెక్టర్‌కు లేఖ అందచేస్తానని ప్రకటన

నెల్లూరు(సిటీ), డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు మేయర్‌ పోట్టూరి స్రవంతి అవిశ్వాస తీర్మాన వ్యవహారం గత కొన్నిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదానికి తెర దించుతూ ఆమె శనివారం రాత్రి కార్పొరేషన్‌ కార్యాలయంలోని తన చాంబరులో మీడియాతో మాట్లాడారు. పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు లేఖను ఆదివారం కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు అందజేస్తానని ఆమె ప్రకటించారు. ‘నన్ను పదవి నుంచి దించాలని కొందరు వ్యక్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కార్పొరేటర్లపైన దాడులు చేస్తున్నారు. మహిళా కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. నాకు మేయర్‌ పదవి ఇచ్చింది జగన్మోహన్‌రెడ్డి. ఆయనకు రుణపడి ఉంటా. నా పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నా. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. నాపై కుట్ర పన్నిన వారందరికీ నా ఉసురు తగులుతుంది’ అంటూ స్రవంతి శాపనార్థాలు పెట్టారు. అనంతరం ఆమె భర్త జయవర్ధన్‌ మాట్లాడుతూ... ‘నా భార్య స్రవంతి దెబ్బకి టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నేతలు గిరిధర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డిల రాజకీయ అంతం పలికే వరకు మా పోరాటం ఆగదు. వీళ్లంతా రాక్షసులు. ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. రేకుల షెడ్డులో ట్యూషన్‌ చెప్పిన నారాయణ రూ.వందల కోట్లు ఎలా సంపాదించాడో బయట పెడతా’ అని హెచ్చరించారు.

Updated Date - Dec 14 , 2025 | 05:53 AM