Resignation Approval: నెల్లూరు మేయర్ రాజీనామాకు ఆమోదం
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:46 AM
నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన రాజీనామా లేఖను ఆదివారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్యాంపు కార్యాలయానికి పంపారు.
గోవాకు చేరిన క్యాంపు రాజకీయం
ఆశలు వదులుకున్న వైసీపీ నేతలు
నెల్లూరు(సిటీ), డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన రాజీనామా లేఖను ఆదివారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్యాంపు కార్యాలయానికి పంపారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన అధికారికి లేఖను అందజేసినట్లు ఆమె భర్త జయవర్ధన్ వెల్లడించారు. అనంతరం అదే లేఖను మీడియా ప్రతినిధులకు విడుదల చేశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 కార్పొరేషన్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఎస్టీ జనరల్ కేటగిరీలో భాగంగా ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి బాగోతం బట్టబయలయ్యాక అతను రెండు పర్యాయాలు జైలు జీవితం గడిపారు. ఆమె పదవి నాలుగేళ్లు పూర్తికావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఆమెను పదవి నుంచి దించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న అవిశ్వాసం పెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తనకు బలం లేదని గ్రహించిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కలెక్టర్‌కు పంపిన లేఖను ప్రభుత్వం ఆమోదించడంతో ఆమె శకం ముగిసినట్లయింది. కాగా, 18న జరగాల్సిన అవిశ్వాస సమావేశం సాధారణ సమావేశంగా జరుగుతుందని కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు తెలిపారు.
ఆచితూచి టీడీపీ పెద్దల అడుగులు
ఇంతటితో మేయర్ వివాదానికి తెర పడిందని అందరూ భావిస్తున్నా, టీడీపీ పెద్దలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మేయర్ తన రాజీనామాను కలెక్టర్ పేరుతో ఇవ్వడంపై ఆరా తీస్తున్నారు. న్యాయబద్ధంగా మేయర్ రాజీనామా చేయాల్సి వస్తే ఆ లేఖను ఎవరికి ఇవ్వాలి? అది అక్కడ్నుంచి ఎవరికి వెళ్తుంది? ఆపై చర్యలు ఏముంటాయోనని ఆరా తీస్తున్నారు. కాగా, అటు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ల బృందం తిరుపతి నుంచి ఆదివారం సాయంత్రం గోవాకు చేరుకుంది. ఇక్కడి పరిస్థితులను బట్టి వారిని తిరిగి నెల్లూరుకు తీసుకువచ్చేందుకు టీడీపీ పెద్దలు రంగం సిద్ధం చేశారు. మేయర్ రాజీనామాపై స్పష్టత వచ్చాకే వారంతానెల్లూరు చేరుకుంటారని తెలుస్తోంది. మేయర్ రాజీనామా ప్రకటనతో అవిశ్వాసంపై వైసీపీ ఆశలు వదులుకుంది. తనకున్న అతికొద్దిమంది కార్పొరేటర్లపై కట్టడిని వదిలేసింది.