Share News

AP Government: ఆ మండలాలు నెల్లూరులోనే?

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:44 AM

రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతనెల 27న ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ఆరు కొత్తగా రెవెన్యూ డివిజన్లు...

AP  Government: ఆ మండలాలు నెల్లూరులోనే?

  • ప్రజల అభ్యంతరాలతో రెవెన్యూ శాఖ నిర్ణయం!

  • 28వ తేదీన కీలక సమావేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతనెల 27న ప్రాఽథమిక గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ఆరు కొత్తగా రెవెన్యూ డివిజన్లు, ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునర్వ్యవస్థీకరణపై నెల రోజుల్లో ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలియజేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లాల కలెక్టర్లకు 500కుపైగా విన్నపాలు, అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. వీటిలోనూ అత్యధికంగా నెల్లూరు జిల్లా నుంచే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్‌లో విలీనం చేశారు. ఈ నిర్ణయాన్ని మూడు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వానికి వరసగా లేఖలు రాశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయుప్రసాద్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామం ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగించింది. ప్రజలు ఇంతలా నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఆ మండలాలను ఏ ప్రాతిపదికన తిరుపతిలో కలిపారన్న చర్చ మొదలైంది. దరిమిలా సీఎం చంద్రబాబే ఈ మండలాల పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా ప్రజలెందుకు స్పందిస్తున్నారు.. వారి ఆందోళనకు కారణాలు, స్థానిక అంశాలు, ఇంకా రాజకీయ పరిస్థితులపై వేర్వేరు నివేదికలు తెప్పించుకున్నారు. ప్రజా స్పందనను పరిగణలోకి తీసుకుని, ఆ తిరుపతిజిల్లాలో విలీనం చేసిన ఆ మూడు మండలాలను తిరిగి నెల్లూరులోనే కొనసాగించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 28న జరిగే సమావేశంలో ఈ విషయంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఇంకోవైపు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో పెద్దహరివాణం మండలాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద హరివాణం మండలం వద్దని, ఆదోనిలోనే కొనసాగించాలని పలు గ్రామాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు రిలే నిరాహారదీక్షలు కూడా చేపట్టారు. ఇందుకు కారణం.. కొత్తగా ఏర్పాటు చేసిన పెద్ద హరివాణం మండల కేంద్రం సుదూరంగా కర్ణాటక సరిహద్దులో ఉండడమేనని ప్రజలు చెబుతున్నారు. ప్రతిపాదిత మండలంలోని 2-3 గ్రామాలకు మినహా ఎక్కువ గ్రామాలకు పెద్ద హరివాణం కనీసం 30-40 కిమీ దూరంలో ఉంటుందని.. పైగా ఆదోని వచ్చి అక్కడి నుంచి అక్కడకు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. అందుచేత తమ గ్రామాలను ఆదోనిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


కలెక్టర్ల నుంచి నివేదికలు..

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలపై రెవెన్యూ శాఖ కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ నెల 28న కీలక సమావేశం నిర్వహించనుంది. వారు వ్యతిరేకిస్తున్న నిర్ణయాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తిరుపతి జిల్లాలో కలిపిన కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను ప్రజల కోరిక మేరకు తిరిగి నెల్లూరు జిల్లాలోకి తీసుకురావాలని రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆదోని మండలం విభజనపై నంద్యాల జిల్లా కలెక్టర్‌ నుంచి ఇప్పటికే సమగ్ర నివేదిక కోరింది. 28న జరిగే సమావేశంలో దానిపైనా నిర్ణయం తీసుకోనుంది. తదనంతరం ముఖ్యమంత్రికి నివేదించనుంది. ఆయన సమక్షంలో చర్చించి తుది నిర్ణయాలు తీసుకున్న తర్వాత మంత్రివర్గం ముందుకు వెళ్తుంది. దాని ఆమోదంతో తుది నోటిఫికేషన్‌ జారీచేస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 25 , 2025 | 04:44 AM