Lady Arun: నెల్లూరు కి లేడీ అరుణ అరెస్టు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:16 AM
కరడుగట్టిన నేరగాడు అవిలేలి శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టుచేశారు. ఇల్లు రాసిస్తావా.. చస్తావా అని ఒక బిల్డర్‌ను బెదిరించిన...
ముగ్గురు అనుచరులు కూడా.. బిల్డర్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
ఇల్లు రాసిస్తావా.. చస్తావా అంటూ అరుణ బెదిరింపులు
వైసీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
పైగా బిల్డర్‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు.. మళ్లీ ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు
అరెస్టు భయంతో సోషల్ మీడియాలో అరుణ వరుస వీడియోలు
హైదరాబాద్ పారిపోయేందుకు యత్నం
అద్దంకి వద్ద అదుపులోకి తీసుకున్న కోవూరు పోలీసులు!
శ్రీకాంత్‌కు సహకరించిన ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది సస్పెన్షన్
నెల్లూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కరడుగట్టిన నేరగాడు అవిలేలి శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టుచేశారు. ‘ఇల్లు రాసిస్తావా.. చస్తావా’ అని ఒక బిల్డర్‌ను బెదిరించిన కేసులో ఆమెను, ముగ్గురు అనుచరులను బుధవారం అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో అరుణను ఒంగోలు జైలుకు తరలించారు. సెటిల్‌మెంట్ల విషయంలో శ్రీకాంత్‌కు సహకరించిన ముగ్గురు ఎస్కార్ట్ కానిస్టేబుళ్లపైనా ఉన్నతాధికారులు వేటువేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మునగ వెంకట మురళీ కృష్ణమోహన్ వృత్తి రీత్యా బిల్డర్. 2010లో సాయి ఎన్‌క్లేవ్ పేరుతో 15 ఫ్లాట్లు కలిగిన అపార్టుమెంట్ నిర్మించి.. 14 ఫ్లాట్లు విక్రయించారు. ఒకఫ్లాటు సొంతానికి ఉంచుకున్నారు. అరుణ 2020లో ఆ ఫ్లాటును అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత దాని కొనుగోలుకు 2022 డిసెంబరు 10న రూ.28 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.3లక్షలు చెల్లించి తన తండ్రి పేరుతో అగ్రిమెంట్ రాయించుకుంది. 2023 ఫిబ్రవరి 11లోపు మిగిలిన రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఇవ్వలేదు. ఇంటి అద్దె కూడా ఇవ్వకపోవడంతో మురళి కోవూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారు పట్టించుకోలేదు. పైగా అరుణ ఫిర్యాదుతో ఆయనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఆ తర్వాత డబ్బు కోసం బిల్డర్ కోవూరు కోర్టులో వాజ్యం వేశారు. దరిమిలా అరుణ, ఆమె అనుచరులు పల్లం వేణు, అంకెం రాజా, ఎలిష్ మరి కొంతమంది ఆయన్ను తరచూ బెదిరించేవారు. గతఏడాది నవంబరులో బిల్డర్ మెడపై కత్తి పెట్టి ఫ్లాటు రాసిస్తావా, చస్తావా అని హెచ్చరించారు. ఆయన్ను కోవూరులోని ఒక ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి.. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం అరుణ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారు. శ్రీకాంత్, అరుణ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో మురళి మంగళవారం రాత్రి కోవూరు పోలీసులను కలిసి అరుణపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తనను అరెస్టు చేయబోతున్నారన్న సమాచారం తెలిసిన ఆమె.. తనను ఆదుకోవాలని మంగళవారం అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడం మొదలుపెట్టింది. పోలీసులు చుట్టుముట్టారని.. ఏం చేస్తారోనని భయంగా ఉందని.. తన కారులో గంజాయి పెట్టి ఆ కేసు మీద అరెస్టు చేస్తారని.. మీడియా తనను ఆదుకోవాలని, పోలీసుల నుంచి రక్షించాలని కోరింది. అరెస్టు భయంతో ఆమె హైదరాబాద్ పారిపోతుండగా బాపట్ల జిల్లా అద్దంకి వద్ద పోలీసులు బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

శ్రీకాంత్‌కు అడుగడుగునా సహకారం
వైద్య పరీక్షల పేరుతో నెల్లూరు జైలు నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లిన ఖైదీ శ్రీకాంత్ అక్కడ ఏమేం చేశాడో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన గత డిసెంబరులో జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆ రోజు ఖలీల్, ఖాజా మొహిద్దీన్, సుబ్బారావు అనే కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా పంపారు. నెల్లూరు సిటీ పరిధి దాటగానే శ్రీకాంత్ పోలీసు వాహనం దిగి ప్రైవేటు వాహనం ఎక్కారు. ఇందుకు ఎస్కార్ట్ కానిస్టేబుళ్లు సహకరించారు. ఆ వాహనం మార్గమధ్యంలో రోడ్డుప్రమాదానికి గురైంది. అయితే శ్రీకాంత్, అరుణకు పోలీసు ఉన్నతాధికారుల్లో ఉన్న పలుకుబడితో విషయంవెలుగులోకి రాలేదు. వైరల్ అయిన వీడియోలో శ్రీకాంత్‌తోపాటు అరుణ, మరికొందరు ఒకే గదిలో ఉన్నట్లు స్పష్టమైంది. వీటన్నిటినీ ధ్రువీకరించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. ఖలీల్, ఖాజా మొహిద్దీన్, సుబ్బారావును సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పేరు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఆయన.. ఖైదీ శ్రీకాంత్‌కు బయటి ప్రపంచంలో స్వేచ్ఛ లభించేలా సిఫారసు చేసినట్లు జిల్లా పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. మరోవైపు.. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌ను డీజీపీ అమరావతికి పిలిపించుకున్నారు. జిల్లాలో రౌడీయిజాన్ని అంతమొందించే దిశగా ఆదేశాలు జారీ చేశారు.