Nellore Jagan Rally: జనం తక్కువ..ఆర్భాటం ఎక్కువ
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:23 AM
జగనన్న పర్యటనకు వేలాదిగా తరలిరండి’ అంటూ వైసీపీ నేతలు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. భారీ జన సమీకరణకు సొమ్ములు ఖర్చు పెట్టినా ఫలితం కనిపించలేదు
జగన్ నెల్లూరు పర్యటనలో హడావుడి.. భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు
అయినా కదిలిరాని పార్టీ శ్రేణులు.. రోడ్డుపై బైఠాయించి ప్రసన్న హంగామా
బారికేడ్లను, పోలీసులను తోసేసి ముందుకు.. హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలు
నెల్లూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘జగనన్న పర్యటనకు వేలాదిగా తరలిరండి’ అంటూ వైసీపీ నేతలు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. భారీ జన సమీకరణకు సొమ్ములు ఖర్చు పెట్టినా ఫలితం కనిపించలేదు. చివరికి... గురువారం జగన్ నెల్లూరు పర్యటన ‘జనం తక్కువ. ఆర్భాటం ఎక్కువ’ అన్నట్లుగా సాగింది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా... జిల్లావ్యాప్తంగా 70వేల నుంచి లక్ష మందిని జగన్ పర్యటనకు తరలించాలని వైసీపీ నేతలు భావించారు. అయితే, పోలీసు ఆంక్షల నేపథ్యంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కదిలి రాలేదు. నెల్లూరు నగరం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు నగదు పంపకాలు జరిగినా ఆశించిన స్థాయిలో జనం రాలేదు. గురువారం ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్ద దిగిన జగన్ నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లి కాకాణితో ములాఖత్ అయ్యారు. అక్కడి నుంచి బయలుదేరి ట్రంక్ రోడ్డు మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆరంభం నుంచి ఆఖరు వరకు ఒక గుంపు మాత్రం జగన్ కాన్వాయ్ ముందు పరుగులు తీస్తూ హడావుడి సృష్టించింది. జీజీహెచ్ సెంటర్ వద్ద జనాన్ని పోగేయడం కోసం అన్నట్లుగా ప్రసన్న కుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి హంగామా చేశారు. పోలీసు నిబంధనల ప్రకారం ప్రసన్న తన ఇంటి వద్దనే ఉండి జగన్‌కు స్వాగతం పలకాలి. కానీ జగన్ నెల్లూరుకు చేరుకోకముందే ఆయన అనుచరులతో కలిసి ట్రంక్‌రోడ్డుపైకి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఈ గుంపును చెదరగొట్టడానికి లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. జగన్ పర్యటన మొత్తంలో ఈ ఒక్కచోట మాత్రమే సుమారు ఐదువేల మంది జనం కనిపించారు. జగన్ సొంత మీడియాలో ఈ గుంపును మాత్రమే ఫోకస్ చేస్తూ భారీగా జనం తరలి వచ్చినట్లు ‘కవరేజ్’ ఇచ్చుకుంది.
పోలీసులను నెట్టేసి.. బారికేడ్లు తొక్కుకుంటూ..
తమ కార్యకర్తలపై, తనపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ ప్రసన్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ ఉండిపోయారు. ఇంతలో జగన్ కాన్వాయ్ అక్కడకు చేరుకుంది. కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా... జగన్ మాత్రం ‘రండి, రండి’ అంటూ చేతులు ఊపారు. దీంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రసన్న కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసిపడేసి ముందుకు వెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులనూ తోసేశారు. అక్కడే ఉన్న ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ మాలకొండయ్య కిందపడటంతో ఆయన కుడి చేయి విరిగిపోయింది. ఒక పోలీసు అధికారి కూడా కిందపడ్డారు.