Share News

Cannabis Gang: గంజాయి బ్యాచ్‌ బరితెగింపు

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:19 AM

నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్‌ మరోసారి బరితెగించింది. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక సీపీఎం నేతను హత్య చేసిన ముఠా..

Cannabis Gang: గంజాయి బ్యాచ్‌ బరితెగింపు

  • నెల్లూరు జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన ముఠా

  • హెడ్‌కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. గాయాలు

  • సీపీఎం నేత హత్య కేసులో పట్టుకునేందుకు వెళ్లినపుడు ఘాతుకం

  • కామాక్షి బ్యాచ్‌ అరాచకం.. వైసీపీతో సంబంధాలు

నెల్లూరు రూరల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్‌ మరోసారి బరితెగించింది. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక సీపీఎం నేతను హత్య చేసిన ముఠా.. ఇదే కేసులో వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్‌పైనా కత్తితో దాడి చేసింది. పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ఓ నిందితుడు గాయపడ్డాడు. అదుపులోకి తీసుకుని అతడితో పాటు గాయపడిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. శనివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా సీపీఎం నేత వి.పెంచలయ్య (35) కొన్ని రోజులుగా నెల్లూరు రూరల్‌ మండలం కల్లూరుపల్లి వద్ద ఆర్డీటీ కాలనీలో పోరాటం చేశారు. ఆయనకు ప్రజల మద్దతు లభించడటంతో తమకు అడ్డువస్తున్నారని కక్షకట్టిన గంజాయి బ్యాచ్‌ నాయకురాలు, వైసీపీతో సంబంధాలున్నా అరవ కామాక్షి, ఆమె తమ్ముళ్లు, అనుచరులు కలిసి దాడి చేశారు. శుక్రవారం పెంచలయ్యను వేటకొడవళ్లతో వెంటాడి దారుణంగా హత్య చేశారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు. శనివారం వేకువజాము మూడు గంటల సమయంలో నిందితుల్లో కొందరు కోవూరు సమీపంలోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో జేమ్స్‌ అనే నిందితుడు హెడ్‌కానిస్టేబుల్‌ ఆదినారాయణపై కత్తితోదాడి చేశాడు. దీంతో రూరల్‌ సీఐ ఆత్మరక్షణలో భాగంగా తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరోసారి కాల్పులు జరిపారు. జేమ్స్‌ కాలికి గాయం కావడంతో పడిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయి.


2న నెల్లూరు జిల్లా బంద్‌

పెంచలయ్యను గంజాయి బ్యాచ్‌ కిరాతకంగా హతమార్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరు జీజీహెచ్‌ వద్ద ఆయన పెంచలయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. డిసెంబరు 2న నెల్లూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - Nov 30 , 2025 | 05:21 AM