Nellore DWMA Wins National Jal Sanchay: నెల్లూరు డ్వామాకు జాతీయ అవార్డు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:31 AM
నెల్లూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) జాతీయ అవార్డును సాధించింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ జేఎ్‌సజేబీ-2015 అరుదైన అవార్డు మన రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు....
నేడు ఢిల్లీలో జల్ సంచయ్-జన్ భాగీదారీ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి నుంచి అందుకోనున్న కలెక్టర్ హిమాన్షు, డ్వామా పీడీ గంగాభవానీ
ఉత్తమ గ్రామ పంచాయతీలుగా దుబ్బిగానిపల్లి, మురుగుమ్మి
నీటి సంరక్షణకు కృషి చేసినందుకు అవార్డులు
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) జాతీయ అవార్డును సాధించింది. జల్ సంచయ్-జన్ భాగీదారీ (జేఎ్‌సజేబీ)-2015 అరుదైన అవార్డు మన రాష్ట్రానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు మాత్రమే దక్కింది. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యమిచ్చినందుకు దక్షిణ జోన్‌లో కేటగిరీ-3 కింద నెల్లూరు జిల్లాకు ఈ అవార్డు దక్కింది. నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ గంగాభవానీ చేపట్టిన వివిధ రకాల నీటి సంరక్షణ పనులతో ఈ అవార్డు సాధించారు. 2024 సంవత్సరంలో జిల్లాలో 856 ఫారం పాండ్స్, 3495 ఇంకుడుగుంతలు, 112 ఊట చెరువులు, 166 చెక్‌డ్యాంలు, 512 వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్, 247 చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. జిల్లాలో మొత్తంగా 5502 భూగర్భ జలాల రీచార్జ్ పనులు పూర్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా, డ్వామా పీడీ గంగాభవానీ ఈ అవార్డును స్వీకరించనున్నారు. దీంతోపాటు రూ.25 లక్షల నగదు పురస్కారం అందుకోనున్నారు. అలాగే, అన్నమయ్య జిల్లా దుబ్బిగానిపల్లి, ప్రకాశం జిల్లా మురుగుమ్మి గ్రామాలకు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా, ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి రాజశేఖరరాజుకు 6వ జాతీయ జలఅవార్డులను ఇదే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధించిన నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల డ్వామా పీడీలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ అభినందనలు తెలిపారు.