Nellore Central Jail: సెంట్రల్ జైలే.. డెన్
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:53 AM
గత వైసీపీ హయాంలో వ్యవస్థలు ఎంతగా నాశనమయ్యాయో చెప్పేందుకు జీవితఖైదీ శ్రీకాంత్ వ్యవహారమే నిదర్శనం. కట్టుదిట్టమైన భదత్ర, నిఘా ఉండే నెల్లూరు సెంట్రల్ జైలు అతనికి డెన్‌గా మారింది.
నాడు ఖాకీ, ఖద్దరు అండతో చెలరేగిన శ్రీకాంత్
వైసీపీ హయాంలో వీఐపీ హోదా
నెల్లూరు జైలులో ఖైదీలపై ఆధిపత్యం
అక్కడే పంచాయితీలు, నేరాలకు స్కెచ్
కట్టడి చేయలేక విశాఖ జైలుకు తరలింపు
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ హయాంలో వ్యవస్థలు ఎంతగా నాశనమయ్యాయో చెప్పేందుకు జీవితఖైదీ శ్రీకాంత్ వ్యవహారమే నిదర్శనం. కట్టుదిట్టమైన భదత్ర, నిఘా ఉండే నెల్లూరు సెంట్రల్ జైలు అతనికి డెన్‌గా మారింది. గత ప్రభుత్వంలో శ్రీకాంత్ కోసం వైసీపీ ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులకు సిఫారసులు చేశారు. ఆ ఐదేళ్లు శ్రీకాంత్ జైలులో వీఐపీ హోదాను అనుభవించాడు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా శ్రీకాంత్ మనోడే అన్నట్లుగా చూసుకోమన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అతడి పెరోల్‌కు పలుసార్లు లేఖలు ఇవ్వడమే కాకుండా తరచూ జైలు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి యోగక్షేమాలు విచారించారు. దీంతో జైలులో అతని పెత్తనం మొదలైంది. శ్రీకాంత్ చెప్పినట్టు ఖైదీలు నడుచుకునేవారు. ఖైదీలు ఆసుపత్రికి వెళ్లాలన్నా అతని అనుమతి తప్పనిసరి. జైలు లోపలికి అడుగుపెట్టిన ప్రతి రిమాండ్ ఖైదీ అతన్ని కలవాల్సిందే. ఏ నేరం కింద జైలుకు వచ్చాడో చెప్పాలి. వివిధ నేరారోపణలపై జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీలను అతను ఆకర్షించాడు. జైలు భోజనం ఉప్పు, కారం లేకుండా ఉంటాయి. కానీ శ్రీకాంత్‌ను కలిస్తే వారి భోజనంలో ఆ రెండు ఉంటాయి. ఉప్పు బాటిల్ నుంచి అప్పడాలు, చెకోడీలు, సిగరెట్ల వరకు అన్ని శ్రీకాంత్ వద్ద అందుబాటులో ఉండేవి. వీటన్నింటికి మించి మొబైల్ ఫోన్ ఉండేది. రిమాండ్ ఖైదీలకు ఈ సౌకర్యాలు కల్పించి శ్రీకాంత్ వారిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.
వారు బయటికి వెళ్లగానే తన మనుషులను కలవమని చెప్పేవాడు. అలా వీరు ఆ గ్యాంగ్‌లో సభ్యులయ్యారు. తెలిసో తెలియకో ఏదో ఒక నేరం చేసి రిమాండ్ జీవితం అనుభవించిన పలువురు యువకులు శ్రీకాంత్ నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి వెనక్కి రాలేని స్థితికి చేరుకున్నారు. వందలాది మంది రౌడీషీటర్లతో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. తనకు అన్ని విధాలా సహకరిస్తున్న జైలు సిబ్బందికి నెలనెలా మామూళ్లు అందజేసేవాడు. ములాఖత్ పేరుతో రౌడీషీటర్లు శ్రీకాంత్‌ను కలిసేవారు. జైలులోనే పంచాయితీలు, నేరాలకు స్కెచ్‌లు వేసేవారు.
అక్కడే ఉంటే ప్రమాదమని..
నెల్లూరు సెంట్రల్ జైలుపై పూర్తి పట్టు సాధించుకున్న శ్రీకాంత్‌ను అక్కడే ఉంచితే కట్టడి చేయడం కష్టమనే ఉద్దేశంతో జైళ్ల శాఖ అతన్ని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించింది. శ్రీకాంత్‌కు గతంలో జైలు నుంచి తప్పించుకున్న చరిత్ర ఉంది. విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న అతనికి కొన్ని సౌకర్యాలను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ విషయంలో పోలీసులు విభిన్న కోణంలో లోతుగా విచారించాలని, వారితో ఎవరికి లింకులు ఉన్నా విడిచి పెట్టవద్దని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
పోలీసు కస్టడీకి అరుణ
కి‘లేడి’ అరుణను పోలీసు కస్టడీకి ఇస్తూ కోవూరు అదనపు ఇన్‌చార్జి మేజిస్ట్రేట్ శారదారెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. బెయిల్ కోరుతూ అరుణ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని తన అపార్టుమెంటులో ప్లాటును ఆక్రమించిన అరుణ, ఆమె అనుచరులు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారి మురళీకృష్ణ 19న కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆమెను అరెస్టుచేసి జైలుకు తరలించడం తెలిసిందే.